సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

రైతు ఉద్యమాలు ఉధృతం

15 గంటల క్రితం

aiks
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 12:03 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- మోడీ పాలనలో పది లక్షల మంది అన్నదాతల ఆత్మహత్య

- కార్పొరేట్ల లాభాల కోసం రైతాంగాన్ని బలి చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు​

- రైతాంగ సమస్యలపై ఆగస్టు పదిన జైల్ భరో : విజ్జూకృష్ణన్

ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి : రైతాంగ సమస్యల పరిష్కారానికి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అఖిల భారత కిసాన్ సభ (ఎఐకెఎస్) ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్ తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడం, పంట నష్టాలు, అప్పులు పెరగడంతో ప్రధాని మోడీ 12 ఏళ్ల పాలనలో పది లక్షలు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. రైతాంగ ఆత్మహత్యల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని జాతీయ క్రైమ్ బ్యూరో నివేదిక వెల్లడించిందని వివరించారు. రైతుల ఆత్మహత్యల నివారణలో పాలకులు విఫలమయ్యారని, కార్పొరేట్ల లూటీ కోసం రైతాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు​ బలిచేస్తున్నాయని విమర్శించారు. ఏలూరులో జరుగుతున్న ఎపి రైతు సంఘం రాష్ట్ర మహాసభకు హాజరైన ఆయన స్థానిక డిసిఎంఎస్ ఫంక్షన్ హాలు (బడా సుబ్బారెడ్డి, వై.జోయా నగర్)లో మీడియాతో ఆదివారం మాట్లాడారు. పాలకుల విధానాల ఫలితంగా దేశ రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేయకపోవడం రైతాంగాన్ని మోసగించడమేనని పేర్కొన్నారు. పంటల ఉత్పత్తి వ్యయం పెరుగుతున్నా కనీస మద్దతు ధర లభించడం లేదని, ఫలితంగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని తెలిపారు. రైతాంగానికి ప్రభుత్వ సంస్థల ద్వారా రుణ సదుపాయాలు, వ్యవసాయ సబ్సిడీలు సక్రమంగా అందడం లేదన్నారు. అభివృద్ధి పేరుతో రైతుల భూములను బలవంతంగా సేకరిస్తూ పారిశ్రామిక కారిడార్లు, రహదారులు, ప్రత్యేక ప్రాజెక్టుల పేరుతో కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తున్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో లక్షా అరవై వేల ఎకరాల భూమిని కోల్పోతున్న రైతులకు సరైన నష్టపరిహారం, పునరావాసం కల్పించకుండా వారి జీవనాధారాన్ని దెబ్బతీస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అవుటర్ రింగ్ రోడ్డు 250 మీటర్లు వేస్తూ రైతుల భూములను అడ్డగోలుగా లాక్కుంటున్నా రన్నారు. రైతులకు తీవ్ర నష్టం కలిగించే విధంగా తెచ్చిన మూడు వ్యవసాయ నల్లచట్టాలను దేశవ్యాప్తంగా ఏడాదిన్న పాటు జరిగిన చారిత్రాత్మక రైతాంగ పోరాటంతో మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని గుర్తు చేశారు. అయితే, ఇప్పుడు వీటిని దొడ్డిదారిలో అమలు చేయాలని చూస్తోందని వివరించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పేరుతో విదేశాల నుండి నూనె గింజలు, పత్తి, మొక్కజొన్న, పాలు తదితర ఉత్పత్తుల దిగుమతులకు ప్రోత్సాహం ఇస్తూ సుంకాలను తగ్గించడం లేదా ఎత్తివేయడం వల్ల దేశీయంగా రైతాంగం తీవ్రంగా నష్టపోనుందని తెలిపారు. ఈ నెల 29న ఢిల్లీలో సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాలతో జాతీయ స్థాయి సమావేశం జరగనుందని తెలిపారు. దేశ వ్యవసాయాన్ని, రైతాంగాన్ని కాపాడేందుకు రైతులు, కార్మికులు, ప్రజాస్వామ్య శక్తులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రైతాంగ సమస్యలపై ఆగస్టు పదిన రైతుల జైల్ భరో కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు.

​ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చిన్న మధ్య తరగతి ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ల నిర్మాణానికి రూ.12 వేల కోట్లు కేటాయిస్తే ఏడు లక్షలు ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. వాతావరణ మార్పులతో సకాలంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వ అధీనంలోనే విత్తన పరిశోధన అవసరమని, విత్తనాల పరిశోధన ప్రయివేట్ కంపెనీలకు ఇవ్వడం వల్ల పంటల దిగుబడి తగ్గిందని వివరించారు. ఈ సమావేశంలో ఎపి రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్.లింగరాజు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్