- 9 మంది బంగ్లాదేశీయులు మృతి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మధ్య కోల్‌కతాలోని మీర్జా గాలిబ్ స్ట్రీట్ ప్రాంతంలోని హోటల్‌లో జరిగిన ఈ ప్రమాదంలో తొమ్మిది మంది బంగ్లాదేశీయులు మృతి చెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. అగ్నిమాపక సిబ్బంది హోటల్ నుంచి మరో 15 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మృతులంతా బంగ్లాదేశ్ జాతీయులేనని పోలీసులు గుర్తించారు. వైద్య చికిత్స కోసం వారు కోల్‌కతాకు వచ్చినట్లు సమాచారం. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కలకత్తా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.
హోటల్ యజమానిపై కేసు
ఈ ఘటనకు సంబంధించి హోటల్‌ను ‘హోటల్ శిఖాలీ’గా గుర్తించారు. హోటల్ యజమానిపై న్యూ మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దట్టమైన పొగ కారణంగా అగ్నిమాపక సిబ్బంది మెట్ల ద్వారా పై అంతస్తులకు చేరుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అగ్నిమాపక శాఖ మంత్రి కౌశిక్ చౌదరి సంఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను సమీక్షించారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ.. ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. తారాపీఠ్‌లో మరో ఘోర హోటల్ అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందిన రెండు రోజులకే కోల్‌కతాలో ఈ ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తారాపీఠ్ ఘటన అనంతరం భద్రతా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి కనీసం 15 హోటళ్లను సీజ్ చేసి కార్యకలాపాలను నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు.







కామెంట్‌లు (0)