శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎప్పటిలోగా తేలుస్తారు?

5 గంటల క్రితం

oioi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 10:35 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఎఫ్‌ఎస్‌ఐపై సమావేశంలో రైతుల ప్రశ్న

- అందరితో మాట్లాడి నిర్ణయం : అదనపు కమిషనర్‌

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఫ్లోర్‌ ‌స్పేస్‌ ఇండెక్స్‌ (ఎఫ్‌ఎస్‌ఐ) అంశాన్ని ఎప్పటిలోగా తేలుస్తారో చెప్పాలని రైతులు ప్రశ్నించారు. మరో రెండేళ్లలో కౌలు గడువు కూడా ముగుస్తుందని, ఎప్పుడు అనుమతులు ఇస్తారు, ఎప్పుడు ఇళ్లు నిర్మించుకోవాలో చెప్పాలని ప్రశ్నించారు. శనివారం సాయంత్రం రాయపూడి సిఆర్‌‌డిఎ కార్యాలయంలో మందడం, తాళ్లాయపాలెం, నవులూరు, ఎర్రబాలెం రైతులతో ఫ్లోర్‌ ‌స్పేస్‌ ఇండెక్స్‌‌పై సమావేశం నిర్వహించారు. దీనికి సిఆర్‌‌డిఎ అదనపు కమిషనర్‌ ‌రాహుల్‌‌ కుమార్‌‌రెడ్డి హాజరయ్యారు. ఎఫ్‌ఎస్‌ఐపై రైతులు తమ అభిప్రాయం చెప్పాలని, దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగు నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. దీనిపై రైతులు తీవ్రంగా స్పందించారు. రెండేళ్లుగా దీనిపై చర్చ చేస్తున్నారని, ఇప్పటి వరకూ అడుగు ముందుకు పడలేదని, ఇంకెప్పుడు తేలుస్తారో చెప్పాలని కోరారు. రాజధాని అమరావతి పరిధిలో గజం స్థలానికి 19.5 అడుగుల నిర్మాణ స్థలం వస్తుందని, అదే గుంటూరు, విజయవాడ వంటి ప్రాంతాల్లో 26 అడుగులు వస్తుందని పేర్కొన్నారు. 630 గజాల స్థలంలో ఇళ్లు నిర్మించాలనుకుంటే రాజధానిలో 12,300 గజాల నిర్మాణ స్థలం వస్తోందని, బయట అయితే 15 వేల గజాలు వస్తోందని వివరించారు. రాజధానికి భూములిచ్చి ఇంత నష్టపోవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. టిడిఆర్‌ ‌బాండ్లపైనా తేల్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు రైతులకు ఇస్తున్న కౌలు గడువు త్వరలో ముగుస్తుందని అన్నారు. ఇలాంటి సమయంలో ఇచ్చిన స్థలంలో రైతులు ఇళ్లు నిర్మించుకోవడానికి అవకాశం ఇవ్వకపోతే ఇంకెప్పటికి పూర్తవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిక్స్‌‌డ్‌ ‌డెవలప్‌‌మెంట్‌ ‌పేరుతో బిల్డర్‌‌కు తాళ్లాయపాలెం పరిధిలో భూమి కేటాయించిన సమయంలో ఎఫ్‌ఎస్‌ఐ 4.5 శాతం కేటాయించారని, ఆ కేటాయింపు రైతులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దీనికి రాహుల్‌‌ కుమార్‌‌రెడ్డి స్పందిస్తూ.. రైతుల అభిప్రాయాలు తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే సమావేశం పెట్టామని అన్నారు. ప్రభుత్వం పెంచాలనుకున్నప్పుడు మా అభిప్రాయాలతో అవసరం ఏముందని రైతులు అన్నారు. ఎఫ్‌ఎస్‌ఐ పెంచాలని రెండేళ్లుగా అడుగుతున్నా అడుగు ముందుకు పడలేదని, అదే రోడ్ల పేరుతోనో ఇంకో పేరుతోనో రైతుల నుండి భూమి తీసుకోవాలనుకుంటే వెంటనే అవార్డు అని చెప్పి లాగేసుకుంటున్నారని తెలిపారు. వరల్డ్‌ ‌క్లాస్‌ ‌రాజధాని అన్నప్పుడు ఇక్కడ భూములకు ఎక్కువ రేటు ఉండాలని, కానీ బిల్డర్లందరూ విజయవాడ, గుంటూరు వైపునకు వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు. నిర్మాణాలన్నీ అక్కడ జరిగితే అమరావతి భూములకు ధరలు వచ్చేది ఎప్పుడని ప్రశ్నించారు. మొత్తంగా శనివారం జరిగిన సమావేశంలో రైతులు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. రాజధానిలో ఎకరం భూమి ఇస్తే 24 సెంట్లు తిరిగి ఇస్తున్నారని, ఇప్పుడున్న నిబంధనల ప్రకారం చూస్తే అందులో ఆరు సెంట్లు స్థలంలో మాత్రమే నిర్మాణానికి అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బయట నగరాల్లో నిర్మాణంలో ఉన్న భవనాల్లో వస్తున్న ఎఫ్‌ఎస్‌ఐ ఎంత ఉందో దానికి అనుగుణంగా కొంతవరకైనా రాజధానిలో పెంచాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్