- ఇంకా దొరకని చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ
ప్రజాశక్తి - కోటనందూరు (కాకినాడ జిల్లా) : ఇది ఒక నాన్న ప్రయత్నం... మూడేళ్ల బిడ్డను పోగొట్టుకున్న తండ్రి తాపత్రయం... కన్న పేగు ఆచూకీ దొరుకుతుందేమోననే చిరు ఆశతో పోస్టర్లను వేసి వెతుకుతున్నారు చిన్నారి జ్ఞానేశ్వరి తండ్రి గణేష్. జూన్ 6న తుని రూరల్ మండలం సిహెచ్ అగ్రహారంలో పామాయిల్ తోటలోకి వెళ్లిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన విషయం తెల్సిందే. అప్పటి నుంచి పోలీసులు, అటవీ సిబ్బంది, ఎన్‌డిఆర్ఎఫ్, ఎస్‌డిఆర్ఎఫ్ బృందాలు గాలిస్తూనే ఉన్నా నేటికీ ఆమె ఆచూకీ దొరకలేదు. చిన్నారితో వెళ్లిన పెంపుడు కుక్క ఐదు రోజుల తరువాత తిరిగొచ్చి మృత్యువాత పడింది. కుక్క పోస్టుమార్టం రిపోర్టుల్లోనూ ఎలాంటి ఆచూకీ దొరకలేదు. పోలీసులు శతవిధాలా ప్రయత్నించినా చిన్న క్లూ కూడా లేకుండా పోయింది. అత్యాధునికి థర్మల్ డ్రోన్లు, పాపను పోలిన బొమ్మలో మాంసాహారం పెట్టి సిసి కెమెరాలతో పర్యవేక్షించినా క్లూ దొరకలేదు. ఓ వైపు పోలీసులు గాలిస్తున్నా.. చిన్నారి తండ్రి మాత్రం తన ప్రయత్నం తాను చేసుకువెళుతున్నారు. రెండు రోజులుగా ఏజెన్సీలోని చింతపల్లి, పాడేరు లంబసింగి, ఘాటీలోని ప్రతి గ్రామానికి వెళ్లి పోస్టర్లను అతికిస్తూ జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం ఇంటింటా ఆరా తీస్తున్నారు. ఈ ఘటన పలువురిని కంట తడిపెట్టిస్తోంది.








కామెంట్‌లు (0)