- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
ప్రజాశక్తి - అల్లూరి : ఆదివాసీ హక్కుల రక్షణకు బిర్సా ముండా స్ఫూర్తితో పోరాడుదామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. బిర్సా ముండా 151వ జయంతిని పురస్కరించుకొని అల్లూరి జిల్లా కేంద్రం చింతల వీధి జంక్షన్లో బిర్సా ముండా విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బిర్సా ముండా స్ఫూర్తితో కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పును జీర్ణించుకోలేక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బలవంతపు మతమార్పిడులు అనే అబద్ధపు, విభజనకారి వ్యాఖ్యలు చేయడం అత్యంత దురదృష్టకరమన్నారు. హామీలను అమలు చేయకపోవడం వల్లే కూటమి ఓటమి చెందిందని, దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏజెన్సీ ప్రాంతాలు తన “బ్రెయిన్‌చైల్డ్” అని సిఎం అంటున్నారని, ఆదివాసీలపై అవమానకర వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆదివాసీలకు స్థానిక ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని అరకు వ్యాలీలో హామీ ఇచ్చి మూడేళ్లు గడిచినా అమలు చేయలేదని, ఆదివాసీల అడవులను కార్పొరేట్ కంపెనీలకు హైడ్రో పవర్ ప్రాజెక్టులు, బాక్సైట్ మైనింగ్ పేరిట అక్రమంగా అప్పగించారని, దీన్ని ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదని, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎన్నికల్లో ఆదివాసీలు తమ ఓటు ద్వారా వ్యతిరేకతను తెలిపారని చెప్పారు. ప్రజల తీర్పును గౌరవించాల్సిన బాధ్యత గల రాజ్యాంగ ప్రతినిధిగా ఉన్న ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, ఇలాంటి రాజకీయాలు మరో మణిపూర్‌లా పరిణమించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గిరిజన ప్రజలు తమ స్వంత అనుభవాలు, అభివృద్ధి, సంక్షేమం ఆధారంగా ఓటు వేశారని, ఆ తీర్పును గౌరవించకుండా మతం పేరుతో దూషించడం గిరిజన సమాజాన్ని అవమానించడమేనని, ఇది ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకమన్నారు. మతం, కులం పేరుతో సమాజాన్ని విభజించే రాజకీయాలను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో నిజమైన అభివృద్ధి, సంక్షేమం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని హితవు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, గిరిజన ప్రజల తీర్పును గౌరవించాలని డిమాండ్ చేశారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం మాట్లాడుతూ... గిరిజన హక్కులను, చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, నూతన అల్లూరి జిల్లా సమగ్ర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల సంక్షేమాన్ని విస్మరిస్తే గిరిజన ఐక్య పోరాటాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సురేంద్ర, ముంచింగిపుట్టు జెడ్పిటిసి కొర్ర త్రినాథ్, నాయకులు ఉమామహేశ్వరరావు, ఎస్బి.పోతురాజు, బి.చిన్నయ్య పడాల్, గంగరాజు, దాస్, కార్తీక్, జీవన్, హైమావతి తదితరులు పాల్గొన్నారు.









కామెంట్లు (0)