రెండు నెలలుగా ఇదే దుస్థితి, పట్టించుకోని అధికార యంత్రాంగం
ప్రజాశక్తి - ఉండ్రాజవరం : ప్రధాన రహదారిపై మురికినీరు ప్రవహిస్తున్నా పాలకుల కంటికి మాత్రం కనిపించడం లేదు. ఉండ్రాజవరం–తణుకు ప్రధాన రహదారిపై పాలంగి ఐడీబీఐ బ్యాంకు వద్ద అపార్ట్‌మెంట్ నుంచి మురికినీరు పొంగిపొర్లుతూ రోడ్డుపైకి చేరుతోంది. దీంతో స్థానిక దుకాణదారులు, పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 20 ఏళ్లుగా ఖాళీగా ఉన్న అపార్ట్‌మెంట్ లో ఇటీవల 15 నుంచి 20 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, దీంతో గత రెండు నెలలుగా మురికి నీటి సమస్య ప్రారంభమైందన్నారు. పంచాయతీ అధికారులకు సమస్యను వివరించినా, పరిష్కరించే చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుర్వాసన, అపరిశుభ్రతతో ఇబ్బందులు పడుతున్నామని జె సత్యనారాయణ, కే. శ్రీనివాస్, దుర్గారావు, హిమలత, కే. ఆదిలక్ష్మి, రఘు, మణికంఠ తదితర స్థానిక దుకాణదారులు పేర్కొన్నారు. ప్రధాన రహదారిపై మురికినీరు పారుతున్నా అధికారుల కళ్లకు మాత్రం కనిపించకపోవడం విడ్డూరంగా ఉందని, ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.








కామెంట్‌లు (0)