- ఆతిథ్యరంగానికి వినియోగించేలా కార్యాచరణ
- నేడు రాజమండ్రిలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు
- మంత్రి కందుల దుర్గేష్
ప్రజాశక్తి–రాజమహేంద్రవరం ప్రతినిధి : విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ వినియోగంపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆమోదంతో కేబినెట్ సబ్కమిటీ నివేదిక ఆధారంగా, సిఆర్జెడ్ నిబంధనలకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం హుకుంపేటలోని పర్యాటక శాఖ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రుషికొండలోని నిర్మాణాలు హోటల్ నిర్వహణకు అనుకూలంగా లేవని, దీంతో కంపెనీలు ముందుకు రావడం లేదన్నారు. వీటిని పర్యాటక శాఖ స్వాధీనం చేసుకుంటుందని చెప్పారు. గతంలో రుషికొండ రిసార్టు ద్వారా పర్యాటక శాఖకు ఏటా సుమారు రూ.15 కోట్ల ఆదాయం వచ్చేదని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్మాణాలతో ఆదాయాన్ని కోల్పోయిందన్నారు. రుషికొండలో మొత్తం తొమ్మిది ఎకరాల విస్తీర్ణం ఉండగా, 7.5 ఎకరాలు సిఆర్జెడ్ పరిధిలో ఉన్నాయని, కేవలం 1.5 ఎకరాల్లోనే నిర్మాణాలకు అవకాశం ఉంటుందని వివరించారు. నిబంధనలను పాటిస్తూ వీలైనంత త్వరగా ప్యాలెస్ వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ నెల 27న రాజమహేంద్రవరం వేదికగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ అధికారికంగా వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 2027లో గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించినట్లు తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పుష్కరాలకు కర్టెన్రైజర్గా ఉపయోగించుకుంటూ ‘ది గోదావరి కాల్స్’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు.







కామెంట్లు (0)