బుధవారం, 18 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకొత్తపట్నం తీరంలో అగ్నిప్రమాదం

2 గంటల క్రితం

కొత్తపట్నం తీరంలో అగ్నిప్రమాదం
-మత్స్యకారుల వేట వలలు దగ్ధం
-  జీవనాధారం కోల్పోయిన 300 కుటుంబాలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 10:03 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • మత్స్యకారుల వేట వలలు దగ్ధం

  • జీవనాధారం కోల్పోయిన 300 కుటుంబాలు

ప్రజాశక్తి-కొత్తపట్నం : ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కె. పల్లెపాలెంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో మత్స్యకారుల వేట వలలు దగ్ధమయ్యాయి. వలలన్నీ ఒకే చోట గుట్టలుగా పోసి ఉండటంతో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. అగ్ని కీలలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు 300 మత్స్యకార కుటుంబాల జీవనాధారం బూడిదపాలైంది. దాదాపు రూ.ఐదు నుంచి రూ. ఆరు కోట్లు, భవనాలు, ఇతర సామగ్రితో కలిపి మొత్తం రూ.50 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జెసి కల్పనాకుమారి, జిల్లా ఎస్ పి వి హర్షవర్ధన్ రాజు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్, సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మత్స్యకారుల నుంచి వివరాలు సేకరించారు. ఇది విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కాదని ప్రాథమికంగా పేర్కొంటూ, సమగ్ర విచారణ జరిపించాలని ఎస్‌పిని కలెక్టర్‌ ఆదేశించారు.

​తాత్కాలిక సాయంగా నిత్యావసరాల పంపిణీ

ప్రమాదంలో వేట వలలు కోల్పోయిన మత్స్యకారులు తక్షణం సముద్రంలోకి వెళ్లి చేపల వేట సాగించే పరిస్థితి లేకపోవడంతో వారి కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో చొప్పున ఉల్లిపాయలు, పంచదార, బంగాళదుంపలు, కందిపప్పుతోపాటు లీటరు వంటనూనె చొప్పున 336 కుటుంబాలకు అందజేశారు.

మత్స్యకారులకు అండగా నిలవాలి : ఉపముఖ్యమంత్రి

ఈ ప్రమాదం పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత మత్స్యకారులకు తక్షణమే అండగా నిలవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. తుపాను కారణంగా మత్స్యకారులు ఇప్పటికే వేటకు వెళ్లలేక జీవనోపాధి కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్నారని పేర్కొన్నారు. వారి కుటుంబాలకు ఆహార భద్రత కల్పించేందుకు వెంటనే నిత్యావసర సరుకులను అందించాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. వలలు కోల్పోయిన బాధిత మత్స్యకారులను ఆదుకోవడానికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన 2.0 పథకం కింద వారికి కొత్త వేట వలలు అందజేసేలా తక్షణ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్