బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గుంటూరు జిల్లాలో వరద బీభత్సం

2 గంటల క్రితం

floods
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 08:46 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- జలదిగ్బంధంలో పెదనందిపాడు మండలం

- పలు ప్రధాన రహదారులపై నిలిచిన రాకపోకలు

ప్రజాశక్తి - గుంటూరు: గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా పెదనందిపాడు మండలం జలదిగ్బంధంలో చిక్కుకుంది. పెదనందిపాడు సమీపంలోని నక్కవాగుకు గండి పడటంతో పెదనందిపాడు, నాగులపాడు గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పెదనందిపాడు నుంచి కొమ్మూరు వెళ్లే బాపట్ల హైవేపై వరద నీరు పొంగిపొర్లుతోంది. నాగులపాడు మార్కెట్ యార్డు సమీపంలోని లో లెవల్ సప్టా వద్ద నీటి ప్రవాహం ఉధృతంగా ఉంది. పెదనందిపాడు నుంచి పొన్నూరు వెళ్లే రహదారిలో రెండు చోట్ల, పర్చూరు వెళ్లే మార్గంలో బ్రిడ్జి దాటిన తర్వాత చిలకలూరిపేట–పర్చూరు రహదారిపై సప్టాల వద్ద వరద నీరు ప్రవహిస్తోంది. అలాగే ప్రత్తిపాడు నుంచి పెదనందిపాడు వచ్చే రహదారిలో కళాశాల సమీపంలోని లో లెవల్ సప్టా పొంగిపొర్లుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరగాని గ్రామానికి ఇరువైపులా ఉన్న లో లెవల్ సప్టాలపై వరద నీరు ప్రవహిస్తోంది.

పెదనందిపాడు నుంచి గుంటూరు, పర్చూరు, బాపట్ల, పొన్నూరు వైపు వెళ్లే ప్రధాన రహదారులపై వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా పెదనందిపాడు మండలం జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాకపోకలు కష్టంగా ఉన్నాయని, పరిస్థితులు అనుకూలిస్తే మధ్యాహ్నం 1గంట తర్వాత వాహనాల రాకపోకలకు అవకాశం ఉండవచ్చని సమాచారం. వరద ఉధృతి తగ్గే వరకు ప్రజలు లోతట్టు ప్రాంతాలు, పొంగిపొర్లుతున్న సప్టాలు, వాగులు దాటేందుకు ప్రయత్నించవద్దని సూచిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్