- విద్య, వైద్యం కార్పొరేటీకరణను వ్యతిరేకించాలి
- మాజీ ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు
ప్రజాశక్తి - బొబ్బిలి: రాష్ట్రం సమగ్ర అభివృద్ధి చెందాలంటే ఆర్థిక, ప్రాంతీయ, మానవ, సమీకృత, సుస్థిర అభివృద్ధిపై ప్రభుత్వం కేంద్రీకరించాలని మాజీ ఎమ్మెల్సీ, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కెఎస్.లక్ష్మణరావు అన్నారు. రాష్ట్ర అభివృద్ధి - సమగ్ర పరిశీలన అంశంపై విజయనగరం జిల్లా బొబ్బిలిలోని ఎస్.ఎస్.ఎస్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం సదస్సు జరిగింది. జెవివి జిల్లా ఉపాధ్యక్షులు పి.సత్యంనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో కెఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందకపోవడంతో ప్రజలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం, విద్యా సంస్థల్లో విద్య కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. విభజన చట్టం హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు టిడిపి కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. నాగావళి, జంఝూవతి, వంశదార, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుల అభివృద్ధికి నిధులు కేటాయించి రైతులకు సాగునీరు ఇవ్వాలని, రైతులు పండించే పంటలను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి 1/70 చట్టాన్ని సమగ్రంగా అమలు చేయాలని కోరారు. ఉత్తరాంధ్రలోనే కాకుండా రాష్ట్రానికే తలమానికంగా ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉచిత విద్య, వైద్యం అందించి కొనుగోలు శక్తి పెంచేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఐక్య రాజ్య సమితి సూచించినా పెడచెవిన పెడుతున్నాయన్నారు. గిరిజన గ్రామాల్లో డోలీ మోతలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఖనిజ సంపదను ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేయడం వల్ల అవసరానికి మించి తవ్వకాలు జరిపి పర్యావరణానికి హాని చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో జెవివి రాష్ట్ర కోశాధికారి జి.మురళీధర్, సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి దివాకర్, జెవివి జిల్లా అధ్యక్షుడు ఎంవిఎన్.వెంకటరావు, ప్రధాన కార్యదర్శి రమణ ప్రభాత్, గౌరవ అధ్యక్షులు కె.శివానంద్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు కర్రి సత్యనారాయణ, యుటిఎఫ్ నాయకులు కె.విజయగౌరి, సమత కన్వీనర్ జి.నిర్మల, జెవివి నాయకులు ఎస్ వి రమణమూర్తి, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)