హైదరాబాద్‌లో ‘విశ్వనాథ్ & సన్స్’ విజయోత్సవ వేడుకను చిత్రబృందం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుటుంబ కథా చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని అందుకున్న చిత్రబృందాన్ని అభినందించారు. సూర్య, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్, మమితా బైజు ఈ సినిమాకు నాలుగు ప్రధాన స్తంభాలని ప్రశంసించారు. సూర్య నటన అద్భుతమని, వెంకీ అట్లూరి రచన, దర్శకత్వానికి అభినందనలు తెలిపారు. ‘విశ్వనాథ్ & సన్స్’కు నిజమైన హీరోలు ప్రేక్షకులేనని, సినిమాను ఆదరిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు.
హీరో సూర్య మాట్లాడుతూ.. ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. వివిధ ప్రాంతాలు, భాషలకు చెందిన కళాకారులంతా కలిసి మంచి సినిమా చేశామని, దానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడం ఆనందంగా ఉందన్నారు. కుటుంబ కథా చిత్రాలకు ప్రేక్షకులు మళ్లీ ఆదరణ కల్పించారని పేర్కొన్నారు. ఈ సినిమాను అందించిన దర్శకుడు వెంకీ అట్లూరికి, తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రవీనా టాండన్ మాట్లాడుతూ..‘విశ్వనాథ్ & సన్స్’ విజయోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని నటి రవీనా టాండన్ అన్నారు. సినిమాను ఆదరించి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు వెంకీ అట్లూరి ఎంతో వినయంగా, ప్రేమగా ఉంటూ నటీనటుల నుంచి మంచి నటన రాబట్టారని ప్రశంసించారు.
దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. ఈ సినిమా విజయానికి ప్రేక్షకులే కారణమని అన్నారు. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు వసూళ్లు రెట్టింపు కావడం తన కెరీర్‌లో ఇదే తొలిసారని తెలిపారు. సినిమాను సూర్య తన భుజాలపై మోశారని, విజయ ఘనతలో ప్రధాన భాగం ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు. హీరోయిన్ రవీనా టాండన్ కూడా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ చిత్రబృందాన్ని అభినందించారు.








కామెంట్‌లు (0)