సాహిత్యానికి ఊపిరి పోసిన గోదావరి సాంస్కృతిక వేదిక : వక్తలు
ప్రజాశక్తి - భీమవరం : సాహిత్యం కనుమరుగవుతున్న నేటి పరిస్థితుల్లో గోదావరి సాంస్కృతిక వేదిక సాహిత్యానికి ఊపిరి పోసిందని పలువురు వక్తలు కొనియాడారు. ప్రజా సంస్కృతికి ప్రోత్సాహం ఎంతో అవసరమని సాహిత్యం, కవిత్వం రచనలను కాపాడుకోవడంతో పాటు భవిష్యత్తు తరాలకు అందించే మార్గాన్ని నిర్దేశించుకోవాలని పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం గోదావరి సాంస్కృతిక వేదిక ఆధ్వర్యాన ‘గోదావరి సాహిత్య ఉత్సవం’ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా గోదావరి సాంస్కృతిక వేదిక ముద్రించిన ‘గోదావరి అలలు’ పుస్తకాన్ని సాహితీ ప్రియులు, కేంద్ర కాంట్రాక్ట్ లేబర్ బోర్డు మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్.బాలకృష్ణ రాజు ఆవిష్కరించారు. పుస్తకావిష్కరణ సభకు వేదిక అధ్యక్షులు కుమార్ కోనపరాజు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా బాలకృష్ణ రాజు మాట్లాడారు. సాహిత్యం ద్వారా అంతులేని ఆనందం జ్ఞానం దొరుకుతుందని, భారత వికాసం ఫౌండేషన్ ద్వారా ఈ వేదికకు పూర్తి సహకారం అందజేస్తామన్నారు. టికెట్ కొనుక్కొని ఆనాడు నాటకాలు చూసేవారమని గుర్తు చేశారు. డిజిటల్ యుగంలో పుస్తకం కనుమరుగవుతోందని, సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా పడిందని పేర్కొన్నారు. జెవివి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వ సురేష్ మాట్లాడుతూ సాహిత్యం ఎటువైపు వెళ్లాలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని, పుస్తకంపై దాడి జరుగుతోందని అన్నారు. పుస్తకానికి ఎదురవుతున్న సవాళ్లపై చర్చించాల్సిన అవసరం ఉందని, పుస్తక క్లబ్బులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. ప్రముఖ కవి డాక్టర్ ప్రసాద్ మూర్తి గోదావరి అలలు పుస్తకాన్ని పరిచయం చేస్తూ... ఉభయగోదావరి జిల్లాల్లో 54 మంది కవులకు సంబంధించిన కవితలు, కథలు పుస్తకంలో ప్రచురించినట్లు తెలిపారు. గోదావరి ప్రాంతంలో అద్భుతమైన కవులు పుట్టారన్నారు. కవులకు కళాకారులకు ప్రాంతం, మతం, కులం అనే భేదం ఉండదని తెలిపారు. సామాజికవేత్త మంతెన సీతారాం మాట్లాడుతూ కాలానికి అనుగుణంగా ఎన్ని మార్పులు వచ్చినా అక్షరం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. జాషువా సాంస్కృతిక వేదిక అధ్యక్షులు గుండు నారాయణరావు మాట్లాడుతూ త్వరలో మహిళా సాహిత్య సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. కూనపు రాజు మాట్లాడుతూ గోదావరి ప్రాంతంలో ఉన్న అనేకమంది సాహితీవేత్తలు , కవులు కళాకారులందరినీ ఒకే వేదిక మీదకి తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఉత్సవం ఏర్పాటు చేశామన్నారు. అనంతరం తెలుగు కథ, నవల పరిచయం, కొత్త కథకులతో, తెలుగు కవిత్వం, కొత్త కవులతో సంభాషణలు జరిగాయి. అనంతరం వారిని సత్కరించారు. కార్యక్రమంలో కెజిఆర్‌ఎల్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ దాయన సురేష్ చంద్ర, జన విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకూడా రంగ సాయి, గోదావరి సాంస్కృతిక వేదిక కార్యదర్శి పి.శ్రీనివాసరాజు, చైతన్య ప్రసాద్, సీతారామరాజు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)