- ప్రముఖుల నివాళి
ప్రజాశక్తి - కడప : మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ సాహితీవేత్త, కథా రచయిత, కడప జిల్లా రచయితల సంఘం గౌరవాధ్యక్షులైన షేక్ హుస్సేన్ (83) సోమవారం కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కడప నగరంలోని ఆయన నివాసంలో మృతి చెందారు. కడప మండల పరిధిలోని రాయలపంతులపల్లె గ్రామంలో 1943 జూన్ 6న హుస్సేన్ జన్మించారు. కీర్తిశేషులు వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో షేక్ హుస్సేన్ ఎమ్మెల్సీగా పనిచేశారు. పాటు కడప జిల్లా డిసిసి అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య, రాజకీయ రంగాలలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన కడప జిల్లా ప్రాంతం నుంచి సాహిత్య, సామాజిక రంగాలకు అందించిన సేవలు చిరస్మరణీయం. కథా రచయితగా, నాటకకర్తగా, శక్తిమంతమైన వక్తగా సాహిత్య లోకంలో సుపరిచితులు. ‘సత్యాగ్ని’ కలం పేరుతో రాసిన కథలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. మానవ విలువలు, సామాజిక స్పృహ ప్రధానంగా ఆయన సృష్టించిన సాహిత్య లోకం పాఠకులను ఎంతగానో ఆలోచింపజేస్తుంది. పాత్రల స్వభావంలో వాస్తవికత తొణికిసలాడేలా ఆయన చేసిన రచనలు తెలుగు కథా సాహిత్యానికి ఒక ప్రత్యేక వన్నె తెచ్చాయి. షేక్ హుస్సేన్ కన్నుమూయడం తెలుగు సాహిత్య లోకానికి, కడప జిల్లాకు తీరని లోటని పలువురు సంతాపం వ్యక్తం చేశారు. కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవి, మాజీ డిప్యూటీ సిఎం అంజాద్‌బాషా, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి షేక్ హుస్సేన్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. షేక్ హుస్సేన్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సాయంత్రం ఆయన అంత్యక్రియలు కడపలోని ముస్లిం శ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఆయనకు భార్య నలుగురు పిల్లలున్నారు.








కామెంట్‌లు (0)