- మంత్రి సవిత
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దేశంలోనే తొలిసారిగా పీ4 మోడల్ లో బిసి నిరుద్యోగ యువతకు ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇవ్వనున్నట్లు బిసి సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. రాష్ట్ర సచివాలయంలోని మంత్రి సమక్షంతో లక్ష్మయ్య ఐఎఎస్ అకాడమీ ప్రతినిధులు, బిసి సంక్షేమ శాఖాధికారులు పరస్పరం ఒప్పంద పత్రాలను సోమవారం మార్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. ఈ శిక్షణ సందర్భంగా మెటీరియల్ ఉచితంగా ఇవ్వడంతో పాటు అభ్యర్థులకు నిష్ణాతులైన అధ్యాపకులు బోధించనున్నట్లు తెలిపారు. బిసి యువత ఉన్నత స్థానాల్లో కొలువుదీరాలన్న ఉద్దేశంతో సివిల్స్ సర్వీసెస్, డిఎస్సి, గ్రూప్ 1, పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాల కోసం బిసి స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణ అందజేస్తున్నామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పి4 మోడల్ లో బిసి యువతకు ఉచిత సివిల్స్ శిక్షణ అందించడానికి దేశంలో ప్రఖ్యాత గాంచిన లక్ష్మయ్య ఐఎఎస్ అకాడమీ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ సివిల్స్ శిక్షణ సందర్భంగా లక్ష్మయ్య అకాడమీ మెటీరియళ్లతో పాటు నిష్ణాతులైన అధ్యాపకులతో వివిధ సబ్జెక్టులపై బోధన అందించనున్నారన్నారు. 2014-19లో బిసి నిరుద్యోగ యువతకు బిసి స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారని మంత్రి సవిత గుర్తు చేశారు. తరవాత వచ్చిన జగన్ ప్రభుత్వం ఉచిత సివిల్స్ కోచింగ్ నిలిపేసిందన్నారు. దీంతో బీసీ నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు పాలైందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ఉచిత సివిల్స్ కోచింగ్ ను పునరుద్ధించిందన్నారు. గడిచిన రెండేళ్లలో 200 మందికి ఉచిత సివిల్స్ కోచింగ్ అంజేశామన్నారు. 2025 మెగా డీఎస్సీకి, గ్రూప్ 1కు కూడా ఉచిత శిక్షణ అందజేశామన్నారు. త్వరలో సివిల్స్ ఉచిత కోచింగ్ ప్రారంభించనున్నామన్నారు. అంతకుముందు మంత్రి సవిత సమక్షంలో ఒప్పంద పత్రాలపై బీసీ సంక్షేమ శాఖ అధికారులు, డాక్టర్ లక్ష్మయ్య ఐఎఎస్ అకాడమీ ప్రతినిదులు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)