ప్రజాశక్తి-ఎన్‌టిఆర్ జిల్లా ప్రతినిధి : రచయిత కృష్ణ కానూరి రచించిన ‘ఎఫ్ స్టీన్ ఫైల్స్’ పుస్తకాన్ని విజయవాడ బాలోత్సవ భవన్‌లో ఆదివారం ఆవిష్కరించారు. సీనియర్ పాత్రికేయులు వడ్లమూడి పద్మ అధ్యక్షతన నిర్వహించిన సభలో ప్రముఖ రచయిత తాడి ప్రకాష్ పుస్తకాన్ని ఆవిష్కరించి, రచయిత స్నేహితుడు జేమ్స్‌కు తొలి ప్రతిని అందజేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి మాజీ సంపాదకులు కె.శ్రీనివాస్ పుస్తకాన్ని సభకు పరిచయం చేశారు.
మాజీ ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ కృష్ణ కానూరి ఎంతో సున్నిత మనస్కుడని, ఎఫ్ స్టీన్ ఫైల్స్‌లోని అంశాలను చూసి ప్రపంచానికి తెలియజేయాలనే తపనతో ఈ పుస్తకాన్ని రచించారని అన్నారు. సమాజానికి అవసరమైన అంశాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన రచయితను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. రచయిత కృష్ణ కానూరి మాట్లాడుతూ ఇది కేవలం ఒక అంతర్జాతీయ కుంభకోణం కథ మాత్రమే కాదని, ఇందులో మన దేశంలోని వ్యవస్థల వాస్తవ పరిస్థితులు కూడా ప్రతిబింబిస్తాయని వివరించారు. అక్కడ జరుగుతున్న పరిణామాలకు, ఇక్కడి పరిస్థితులకు పెద్దగా తేడా లేదని, భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కువగా ఉండటం వల్లే అక్కడ ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు.
ఈ అంశాలపై తాను తొలుత ఫేస్‌బుక్ ద్వారా కథనాలు రాసి ప్రజల దృష్టికి తీసుకెళ్లానని, అనంతరం ప్రజాశక్తి బుక్ హౌస్ ప్రోత్సాహంతో అవి పుస్తక రూపం దాల్చాయని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజాశక్తి బుక్ హౌస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.








కామెంట్‌లు (0)