ఖాట్మండు : విపత్తు నిర్వహణ, అటవీ యుద్ధ తంత్రాలు మరియు మానవతా సహాయంపై దృష్టి సారిస్తూ భారత్, నేపాల్ దేశాల మధ్య సంయుక్త సైనిక శిక్షణ విన్యాసాలు బుధవారం ప్రారంభమయ్యాయి.
‘అభ్యాస్ సూర్యకిరణ్’ పేరిట నిర్వహిస్తున్న ఈ 20వ విడత శిక్షణ విన్యాసాలు రూపందేహి జిల్లా సల్ఝండిలోని నేపాల్ ఆర్మీ బ్యాటిల్ స్కూల్‌లో మొదలైనట్లు నేపాల్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఇరు దేశాల బెటాలియన్ స్థాయి సైనికులు పాల్గొంటున్న ఈ విన్యాసాలు డిసెంబర్ 8 వరకు కొనసాగుతాయి.
ఈ విన్యాసాల సమయంలో ఇరు దేశాల సైనిక సిబ్బంది విపత్తు నిర్వహణ, అటవీ ప్రాంతాల్లో యుద్ధ తంత్రాలు (ఫారెస్ట్ వార్‌ఫేర్), మానవతా సహాయక చర్యలకు సంబంధించిన సైద్ధాంతిక, ప్రాయోగిక అంశాలతో పాటు తమ ప్రత్యేక అనుభవాలను పరస్పరం పంచుకోనున్నారు.
గత ఏడాది ఈ సంయుక్త సైనిక విన్యాసాల 19వ ఎడిషన్ ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌లో జరిగింది. ఇలాంటి విన్యాసాల వల్ల ఇరు దేశాల సైన్యాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు మరింత బలపడటంతో పాటు, సైనికుల వృత్తిపరమైన నైపుణ్యాలు, పరస్పర అవగాహన పెరుగుతాయని నేపాల్ సైన్యం ఆశాభావం వ్యక్తం చేసింది.







కామెంట్‌లు (0)