బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దీపం వివాదం: తమిళనాడు ప్రభుత్వంపై కోర్టు ధిక్కార పిటిషన్‌ను విచారించనున్న సుప్రీంకోర్టు

18 నిమిషాల క్రితం

దీపం వివాదం: తమిళనాడు ప్రభుత్వంపై కోర్టు ధిక్కార పిటిషన్‌ను విచారించనున్న సుప్రీంకోర్టు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 11:58 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : మధురై జిల్లా తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న దీపతూణ్ వద్ద సంప్రదాయ కార్తీక దీపాన్ని వెలిగించకపోవడంపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వం సమర్పించిన స్థితిగతుల నివేదికను (స్టేటస్ రిపోర్ట్) కూడా పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది.


దీపం వెలిగించే విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తమిళనాడు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్‌ను జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం. పంచోలిలతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు.


విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ఈ వ్యవహారంలో తాజా పరిణామాలను వివరిస్తూ తాము స్థితిగతుల నివేదికను దాఖలు చేయాల్సి ఉందని ధర్మాసనానికి తెలిపారు. దురదృష్టవశాత్తు దీపతూణ్ వద్ద సంప్రదాయ దీపాన్ని వెలిగించలేకపోయామని పేర్కొంటూ, తమ నివేదికను పరిశీలించాలని కోరారు.


దీపం వెలిగించేందుకు అనుమతి కోరిన పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ఈ పరిణామాలను "అత్యంత దురదృష్టకరం" అని అభివర్ణించారు. వివాదాస్పద ప్రాంతంలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని, సంప్రదాయ ఆచారాల ప్రకారం అక్కడ దీపం వెలిగించడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వం మద్రాస్ హైకోర్టుకు తెలిపిన విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు.


సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అమలు చేయలేదని పిటిషనర్ న్యాయవాది ఆరోపించారు. జ్యోతిని దీపతూణ్ వద్దకు తీసుకెళ్లి అక్కడ దీపం వెలిగించి ఉండాల్సిందని వాదించారు. కోర్టు ఆదేశాలను అమలు చేస్తామని చివరి నిమిషం వరకు హైకోర్టుకు పదేపదే హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలను పక్కదారి పట్టించిందని ఆరోపిస్తూ.. సంబంధిత అధికారులపై సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కూడా ఆయన ప్రస్తావించారు. దీనిపై తాము కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేస్తామని సీనియర్ న్యాయవాది చెప్పగా.. "దాఖలు చేయండి, ఆ తర్వాత చూద్దాం" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.


నేపథ్యం:

నవంబర్ 24న ఒకసారికి మాత్రమే (వన్-టైమ్ మెజర్) తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న రాతి స్తంభమైన దీపతూణ్ వద్ద సంప్రదాయ కార్తీక దీపాన్ని వెలిగించేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు నవంబర్ 21న ఆదేశాలు జారీ చేసింది. అయితే శాంతిభద్రతల ఆంక్షలు, సంప్రదాయ ఆచారాలను కారణంగా చూపుతూ తమిళనాడు అధికారులు ఆ ఆదేశాలను అమలు చేయకపోవడంతో తాజా వివాదం తలెత్తింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్