- 516 కేసుల నమోదు.. 294 బృందాలతో తనిఖీలు
- విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల అక్రమ నిల్వలు, అధిక ధరల విక్రయాలు, బ్లాక్ మార్కెటింగ్‌పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో రూ.10.43 కోట్ల విలువైన సరుకులను స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. అక్టోబరు 26 నుంచి ఈనెల 14వ తేదీ వరకు 294 బృందాలు 248 మార్కెట్లు, ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి 516 కేసులు నమోదు చేసినట్లు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 714 హోల్‌సేల్ వ్యాపార సంస్థలు, 17 రైస్ మిల్లులు, 13 గోదాములు, 144 రిటైల్ దుకాణాలను తనిఖీ చేసినట్లు ఆయన తెలిపారు. తనిఖీల్లో ధరల అసాధారణ పెరుగుదలకు సంబంధించి ఒకటి, కొరత, కృత్రిమ కొరతకు సంబంధించి ఒకటి, అక్రమ నిల్వలు, మళ్లింపు, బ్లాక్ మార్కెటింగ్‌కు సంబంధించి మూడు కేసులను గుర్తించినట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న వాటిలో 159.204 టన్నుల బియ్యం, 2,017.755 మెట్రిక్ టన్నుల ధాన్యం, 831.45 కిలోల పప్పులు, అక్రమ రవాణాకు సంబంధించిన 1,050 కిలోల సరుకులు, 1,930 లీటర్ల వంటనూనె, 9.3 మెట్రిక్ టన్నుల బెల్లం ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిత్యావసర వస్తువుల ధరలు, నిల్వలు, సరఫరాపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. సివిల్ సప్లైస్, జిఎస్ టి, ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ, రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో తనిఖీలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడే వారిపై పిడి చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.








కామెంట్లు (0)