ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మహాత్మా జ్యోతిబా ఫూలే ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు బిసి సంక్షేమ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకే సంస్థలో 8 విద్యా సంవత్సరాలు పూర్తి చేసిన ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. విద్యా సంవత్సరంలో సగానికి మించి పనిచేసిన కాలాన్ని ఒక పూర్తి విద్యా సంవత్సరంగా పరిగణించనున్నారు. ఒక స్టేషన్లో కనీసం 2 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులు మాత్రమే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఒకే స్టేషన్లో ఉద్యోగి వివిధ కేడర్లలో పనిచేసిన కాలాన్ని కలిపి సర్వీస్ కాలంగా పరిగణించనున్నారు. అలాగే బాలికల సంస్థల్లో పనిచేస్తున్న 50 సంవత్సరాల లోపు పురుష ఉద్యోగులు, ప్రిన్సిపాళ్లు, బోధనేతర సిబ్బందిని బాలుర సంస్థలకు బదిలీ చేయనున్నారు.
రెండేళ్లలో రిటైర్ అయ్యేవారికి మినహాయింపు
రెండు సంవత్సరాలలోపు ఉద్యోగ విరమణ చేయనున్న ఉద్యోగులను తప్పనిసరి బదిలీల నుంచి మినహాయించారు. దృష్టిలోపం ఉన్న ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చారు. అయితే వారు స్వచ్ఛందంగా బదిలీ కోరితే నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు. వైకల్యం, తీవ్రమైన అనారోగ్యం, వితంతువు ఉద్యోగులు, భార్యాభర్తల కేసులు తదితర ప్రాధాన్యత కేటగిరీలకు బదిలీల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి, వితంతువులు, చట్టబద్ధంగా విడిపోయిన మహిళా ఉపాధ్యాయులకు, నిర్దిష్ట తీవ్రమైన వ్యాధులతో చికిత్స పొందుతున్న ఉద్యోగులకు నోటిఫై చేసిన ఖాళీల నుంచి ఎంపిక చేసుకునే అవకాశం కల్పించనున్నారు. బదిలీల ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే నిర్వహించనున్నారు. ఎపిసిఎఫ్ఎస్ఎస్ ద్వారా సాఫ్ట్వేర్ను రూపొందించి, ఉద్యోగుల సర్వీస్కు సంబంధించిన పాయింట్ల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. మెరిట్ జాబితా ప్రచురించిన తర్వాత ఒక రోజులోపు అభ్యంతరాలు స్వీకరించి, అనంతరం తుది మెరిట్ జాబితాను ప్రకటిస్తారు. బదిలీల్లో మహిళలు, కేడర్లో సీనియారిటీ, వయస్సు ఆధారంగా టైను పరిష్కరించనున్నారు. బదిలీపై తుది నిర్ణయం తీసుకునే అధికారం సొసైటీ కార్యదర్శికి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన తర్వాత ఈ మార్గదర్శకాల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టాలని కార్యదర్శిని ఆదేశించింది.








కామెంట్లు (0)