- డిఎస్‌పి విచారణ
ప్రజాశక్తి – శ్రీకాళహస్తి (తిరుపతి జిల్లా) : తీసుకున్న అప్పు తీర్చలేదనే కారణంతో తల్లితో సహా ఆరు నెలల పసికందును ఓ వ్యక్తి తన ఇంటికి తీసుకెళ్లిన ఘటన ఈ నెల 11న తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం శివనాథపాలెంలో జరిగింది. గ్రామానికి చెందిన ఆది, మేఘమాల దంపతులు సుమారు ఆరు నెలల క్రితం శ్రీకాళహస్తికి చెందిన అన్న వరసయ్యే వెంకటగిరి ప్రసాద్ వద్ద రూ.2 వడ్డీకి రూ.1.50 లక్షలు అప్పు తీసుకున్నారు. అప్పటి నుంచి వడ్డీ, అసలు చెల్లించలేదు. మేఘమాల భర్త ఆది పని నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లడంతో ఆమె బిడ్డతో ఇంట్లో ఉన్న సమయంలో ప్రసాద్... ఇంటికి వెళ్లి దుర్భాషలాడి, తల్లీబిడ్డను తన ఇంటికి తీసుకెళ్లారు. దీంతో, మేఘమాల తల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ప్రసాద్ తల్లీబిడ్డను తిరిగి ఇంటికి పంపించేశారు. అనంతరం మేఘమాల సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. తన భర్త అప్పు తీర్చలేదనే కోపంతో తన బిడ్డతో ప్రసాద్ ఆయన ఇంటికి తీసుకెళ్లారని ఆమె వీడియోలో తెలిపారు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనపై స్పందించిన శ్రీకాళహస్తి డిఎస్‌పి పావని మీడియాతో మాట్లాడారు. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు. ఆమె వెంట సిఐ లక్ష్మీనారాయణ, ఎస్‌ఐ బాలకృష్ణ ఉన్నారు.








కామెంట్‌లు (0)