- టాస్క్ఫోర్స్ ఏర్పాటు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపి సముద్ర జలాల్లో ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన మత్స్యకార బోట్లు అనుమతి లేకుండా ప్రవేశించి చేపల వేట సాగించకుండా కట్టడి చేసేందుకు ప్రభుత్వం జరిమానాలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తీర ప్రాంతమంతటా నిఘా, పర్యవేక్షణను పటిష్టం చేయడంతోపాటు అక్రమ చేపల వేటకు పాల్పడే బోట్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు సంయుక్త టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు మత్స్యశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎపి సముద్ర జలాల్లో ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన బోట్లు అనధికారికంగా ప్రవేశించి చేపల వేటకు పాల్పడితే జరిమానాలతోపాటు చేపల పట్టుబడి, వేట పరికరాలపై చర్యలు తీసుకోనున్నారు. మొదటిసారి పట్టుబడితే రూ.2 లక్షల జరిమానా విధించడంతోపాటు పట్టుబడిన చేపలను వేలం వేస్తారు. చేపల వేటకు ఉపయోగించిన పరికరాలు, వలలను స్వాధీనం చేసుకుంటారు. రెండోసారి పట్టుబడితే రూ.4 లక్షల జరిమానా విధిస్తారు. పట్టుబడిన చేపలతోపాటు స్వాధీనం చేసుకున్న వేట పరికరాలు, వలలను వేలం వేస్తారు. సంబంధిత బోటును కూడా జప్తు చేస్తారు. రాష్ట్ర తీర ప్రాంతమంతటా నిరంతర నిఘా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన కమిటీలో మత్స్యశాఖ, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, అటవీశాఖ ప్రతినిధులతోపాటు స్థానిక మత్స్యకారుల ప్రతినిధికి చోటు కల్పించారు. మత్స్యశాఖకు చెందిన అధీకృత అధికారి లేదా ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ (ఎఫ్డీఓ) కమిటీ చైర్మన్, కన్వీనర్గా వ్యవహరిస్తారు. కోస్టల్ సెక్యూరిటీ పోలీసుల నుంచి ఎస్ఐ స్థాయి కంటే తక్కువ కాని అధికారి, అటవీశాఖ నుంచి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ స్థాయి కంటే తక్కువ కాని అధికారి సభ్యులుగా ఉంటారు. జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు లేదా చురుకైన సముద్ర మత్స్యకారుల నుంచి ఒకరిని నాన్-ఆఫీషియల్ సభ్యుడిగా నియమిస్తారు.








కామెంట్లు (0)