వితంతు పెన్షన్ కోసం దరఖాస్తు చేసినా పట్టించుకోలేదని ఆక్షేపణ
అధికారుల తీరుపై న్యాయమూర్తి అసంతృప్తి
ప్రజాశక్తి-అమరావతి : అర్హత ఉన్నప్పటికీ వితంతు పెన్షన్ మంజూరు చేయడంలో, బకాయిలు చెల్లించడంలో జాప్యం చేయడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం తగదని, అర్హులైన వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొంది. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఉప్పరపాలెం గ్రామానికి చెందిన దరఖాస్తుదారు భర్త 2023 నవంబరులో మరణించగా, ఆమె వితంతు పెన్షన్ కోసం 2024 మార్చి 16న దరఖాస్తు చేసుకున్నారు. అయితే పెన్షన్ మంజూరులో జాప్యం జరగడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరపున న్యాయవాది వాదిస్తూ, పెన్షన్ మంజూరుకు అవసరమైన అర్హతలన్నీ ఉన్నప్పటికీ అధికారులు దరఖాస్తును పరిష్కరించలేదని తెలిపారు. పెన్షన్ బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం నిర్దిష్ట కాలపరిమితిని పాటించాలని కోరారు. విచారణ సందర్భంగా అధికారులు సమర్పించిన వివరాలపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. పిటిషనర్‌కు పెన్షన్ మంజూరు చేయడంతోపాటు బకాయిలను ఎనిమిది వారాల్లో చెల్లించాలని ఆదేశించారు. దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి పెన్షన్ మంజూరయ్యే వరకు బకాయిలను లెక్కించి చెల్లించాలని స్పష్టం చేశారు. అర్హత ఉన్నప్పటికీ పెన్షన్ మంజూరులో జాప్యం చేయడం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అర్హులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందకుండా పోకూడదని స్పష్టం చేస్తూ, పిటిషనర్‌కు చెల్లించాల్సిన బకాయిలను నిర్ణీత గడువులో చెల్లించాలని ఆదేశించారు.






కామెంట్‌లు (0)