జనసేన నాయకుల బంధువులమంటూ నమ్మించి రూ.ఏడు కోట్లు వసూళ్లు..
నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు, ఫేక్ ఐడీ కార్డుల సృష్టి
ప్రజాశక్తి - మంగళగిరి రూరల్ : జనసేన నాయకుల పేర్లు చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి సుమారు రూ.7 కోట్ల మేర వసూలు చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. ధరణి కృష్ణ అనే మహిళ... జనసేన నాయకులు కల్యాణం శివశ్రీనివాస్, కోటా రుక్మిణి తమకు బంధువులని చెప్పుకుంటూ పలువురు నిరుద్యోగులను మోసం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 25 మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మించి వారి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తాడేపల్లిగూడెంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి నుంచి రూ.25 లక్షలు, లండన్‌లో పనిచేస్తున్న మరో వ్యక్తి నుంచి రూ.25 లక్షలు వసూల చేశారు. దేవాదాయ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పలువురి నుంచి నగదు తీసుకోవడంతో పాటు నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు, ఫేక్ ఐడి కార్డులు సృష్టించి ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. జనసేన నాయకుడు కల్యాణం శివశ్రీనివాస్ తనకు బాబాయి అవుతారని ధరణి కృష్ణ చెప్పుకుంటూ ఈ వ్యవహారాన్ని నడిపినట్లు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం దృష్టికి చేరడంతో కల్యాణం శివశ్రీనివాస్ స్పందిస్తూ ధరణి కృష్ణ ఎవరో తనకు తెలియదని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంతో తనకు ఎటువంటి సంబంధం లేదని, వాస్తవాలు వెలుగులోకి తేవాలని కోరుతూ కల్యాణం శివశ్రీనివాస్, కోటా రుక్మిణి మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ధరణి కృష్ణపై ఫిర్యాదు చేశారు. ఈ మోసం వెనుక ఉన్న వ్యక్తులు, నగదు వసూళ్లు, నకిలీ పత్రాల తయారీ తదితర అంశాలపై విచారణ చేసి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.







కామెంట్‌లు (0)