ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గోదావరి పుష్కరాలకు భారీ ప్రణాళిక

21 నవంబర్, 2026

గోదావరి పుష్కరాలకు భారీ ప్రణాళిక
- 10 కోట్ల మంది వచ్చే అవకాశం
- మార్చి నాటికి ఏర్పాట్లు పూర్తి
- సిఎం చంద్రబాబు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 10:00 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- 10 కోట్ల మంది వచ్చే అవకాశం

- మార్చి నాటికి ఏర్పాట్లు పూర్తి

- సిఎం చంద్రబాబు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో: వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై శనివారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. సుమారు 10 కోట్ల మంది యాత్రికులు రావొచ్చన్నారు. రూ.3,723.69 కోట్ల అంచనా వ్యయంతో 22 శాఖల పరిధిలో 4,862 పనులు చేపట్టాలన్నారు. ఇప్పటికే రూ.2,051.70 కోట్ల విలువైన 2,260 పనులకు పరిపాలనా అనుమతులిచ్చామన్నారు. పుష్కరాలకు సంబంధించిన పనులన్నీ 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో 440 ఘాట్ల వద్ద యాత్రికులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. దాదాపు రూ.649.70 కోట్ల విలువైన 659 పనులు ఇప్పటికే ప్రారంభం కాగా, రూ.25.53 కోట్లతో చేపట్టిన 69 పనులు పూర్తయ్యాయన్నారు. తాగునీరు, పారిశుధ్యం, తాత్కాలిక మరుగుదొడ్లు, విద్యుత్‌ దీపాలంకరణ, వ్యర్థాల నిర్వహణకు రూ.464 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించామని తెలిపారు. పుష్కరాల సమయంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ రహదారులను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. రూ.300 కోట్లతో 78 రహదారుల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. పుష్కరాల కోసం 4 వేల ప్రత్యేక బస్సులు, 649 గ్రీన్‌ బస్సులు నడపడంతోపాటు 1,560 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో అదనపు ప్లాట్‌ఫారం, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిల అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నారన్నారు. అత్యవసర వైద్య సేవల కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో అదనంగా 100 పడకలు ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. దేశవిదేశాల నుంచి వచ్చే వారికి సమాచారం అందించేందుకు 135 భాషల్లో సేవలందించే ఎఐ చాట్‌బాట్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. పుష్కరాల నిర్వహణను పర్యవేక్షించేందుకు ఆధునిక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహా కుంభమేళా నిర్వహణలో అనుసరించిన మెరుగైన విధానాలను గోదావరి పుష్కరాల్లోనూ అమలు చేయాలని సిఎం చంద్రబాబు సూచించారు. రాజమహేంద్రవరం నుంచి పోలవరం మధ్య 40 కిలోమీటర్ల జలమార్గంలో ఆరు ఫ్లోటింగ్‌ పంటూన్లు ఏర్పాటు చేయాలన్నారు. విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం విమానాశ్రయాలను సుందరీకరించడంతోపాటు పుష్కర జిల్లాల్లో ఇవి ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడం, వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించడం, గోదావరి జలాల నాణ్యతను కాపాడటంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిఎం ఆదేశించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్