అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. రాగల మూడు రోజులు రెండు రాష్ట్రాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులతో పాటు గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం .... ఉత్తర ఒడిశా, దానిని ఆనుకుని ఉన్న జార్ఖండ్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఈశాన్య మధ్యప్రదేశ్, దానికి ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి.
ఉత్తర కోస్తా, యానాంలో..
ఆదివారం ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించవచ్చు. సోమవారం కొన్ని ప్రాంతాల్లో, మంగళవారం ఒకటి రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశముంది. మూడు రోజులూ గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాలో..
ఆదివారం, సోమవారం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల పిడుగులు, మెరుపులు సంభవించవచ్చు. మంగళవారం అక్కడక్కడ వర్షాలు పడే అవకాశముంది. ఈ మూడు రోజుల్లోనూ గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రాయలసీమలోనూ వర్షాలు
రాయలసీమలో ఆదివారం కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశం ఉంది. సోమవారం, మంగళవారం ఒకటి రెండు చోట్ల వర్షాలు పడొచ్చు. మూడు రోజులూ గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
తెలంగాణకు కూడా వర్ష సూచన ....
అల్పపీడనంతో పాటు రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణలోనూ మరో మూడు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం నుంచి మంగళవారం వరకు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడవచ్చు. రాగల మూడు రోజుల్లో తెలంగాణలో దిగువ స్థాయి ఉపరితల గాలులు గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.








కామెంట్‌లు (0)