న్యూఢిల్లీ : మాజీ విద్యార్థి ఉమర్ ఖలీద్ పుస్తకంపై చర్చ జరిపేందుకు జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ అనుమతి నిరాకరించింది. ఉమర్ ఖలిద్ రచించిన 'ఫ్రాక్చర్డ్ కమ్యూనిటీస్: ఆదివాసి హిస్టరీస్ అండ్ ది పాలిటిక్స్ ఆఫ్ పవర్' అనే పుస్తకంపై జరగాల్సిన చర్చా కార్యక్రమం కోసం ఆడిటోరియం బుకింగ్‌ను రద్దు చేసినట్లు జెఎన్‌యు తెలిపింది. ప్రపంచ ఆదివాసీల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా.. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (ఎస్‌ఎస్‌ఎస్-1) ఆడిటోరియంలో ఈ చర్చా కార్యక్రమం జరగాల్సి వుంది. "కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించకపోవడం వల్ల SSS-1 ఆడిటోరియం బుకింగ్‌ను రద్దు చేశాం ’’ అని జెఎన్‌యు ఆదివారం ఎక్స్ పోస్ట్‌లో పేర్కొంది. జెఎన్‌యు ఒక "ప్రజాస్వామ్య, వికేంద్రీకృత సంస్థ" అని, దీనికి సంబంధించిన అనుమతిని SSS డీన్ మంజూరు చేశారని, ఆ తర్వాత ఆయనే ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తూ చర్యలు తీసుకున్నారని యూనివర్శిటీ తెలిపింది.
ప్రొఫెసర్ అవినాష్ కుమార్ అధ్యక్షతన ప్రొఫెసర్ ప్రభు మహాపాత్ర, ప్రొఫెసర్ ఉమా చక్రవర్తి, శుద్ధబ్రత సేన్‌గుప్తా, హర్ష్ మందర్, బనోజ్యోత్స్న లహిరిలు ఈ పుస్తకంపై చర్చించనున్నట్లు పోస్టర్ పేర్కొంది. ఈ ఆడిటోరియం బుకింగ్ ఆగస్టు 7న ఖరారైంది. అయితే, కార్యక్రమానికి సంబంధించి ఏవివరాలను వెల్లడించలేదనే అంశంపై జెఎన్‌యు స్పష్టతనివ్వలేదు. మత సంస్థలు క్యాంపస్‌ను వినియోగించడం యూనివర్శిటీ నిబంధనలను ఉల్లంఘించడమేనని జెఎన్‌యు విద్యార్థి సంఘం (జెఎన్‌యుఎస్‌యు) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో క్యాంపస్‌లో జరగాల్సిన ఇస్కాన్ కార్యక్రమాన్ని జెఎన్‌యు రద్దు చేసింది. ఇది జరిగిన కొన్ని రోజులకే ఈకార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
జెఎన్‌యు ఏకపక్ష, నిరంకుశ నిర్ణయాన్ని జెఎన్‌యుఎస్‌యు ఖండించింది. యూనివర్శిటీ క్యాంపస్‌లో పుస్తకంపై చర్చించడం అనేది విద్యా సంస్కృతిలో, ప్రజాస్వామ్యంలో ఒక ప్రాథమిక భాగమని జెఎన్‌యుఎస్‌యు ఒక ప్రకటనలో పునరుద్ఘాటించింది. ఈ కార్యక్రమానికి వేదికను రద్దు చేయడం ద్వారా, జెఎన్‌యు యంత్రాంగం మరోసారి తన విద్యార్థి వ్యతిరేక, మేధో వ్యతిరేక ఎజెండాను బయటపెట్టిందని మండిపడింది. “బుకింగ్ సమయంలో పూర్తి వివరాలు ఇవ్వలేదు” అని జెఎన్‌యు పేర్కొనడం కేవలం ఒక సాకు మాత్రమేనని, అసలు ఉద్దేశ్యం చర్చను అడ్డుకోవడమేనని ఆరోపించింది. ఇతర కార్యక్రమాలకు, ముఖ్యంగా ఇస్కాన్ కార్యక్రమాలకు యాజమాన్యం సహకరిస్తున్నప్పుడు, ఈ విద్యాపరమైన చర్చకు మాత్రం స్థలం నిరాకరించడం ద్వంద్వ ప్రమాణమని విమర్శించింది. “విద్యార్థుల కార్యక్రమాలకు నిబంధనలు, అర్హతలు అంటూ కఠినంగా వ్యవహరిస్తున్న యాజమాన్యం, తన స్వంత ఫ్యాకల్టీ నియామకాల విషయంలో కూడా అదే నిబంధనలను కచ్చితంగా పాటించిందా? అని జెఎన్‌యుఎస్‌యు నిలదీసింది. రిపోర్టర్స్ కలెక్టివ్ ప్రచురించిన, జర్నలిస్ట్ అలోక్ రాజ్‌పుత్ చేసిన ఒక ఇటీవలి పరిశోధనాత్మక నివేదిక, ప్రస్తుత వైస్ ఛాన్సలర్ పదవీకాలంలో అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ స్థాయిలలో జరిగిన అనేక ఫ్యాకల్టీ నియామకాలను ఆందోళనలను లేవనెత్తిన సంగతి తెలిసిందే. నియమితులైన వ్యక్తులు ఆ ఉద్యోగ ప్రకటనల్లో పేర్కొన్న కనీస బోధనా అనుభవం, ప్రచురణల అర్హతలను అందుకోలేదని తేలిందని జెఎన్‌యుఎస్‌యు పేర్కొంది. ఆదివాసీల జల్–జంగల్–జమీన్ పోరాటాలపై ఉన్న పుస్తకాన్ని చర్చించకుండా అడ్డుకోవడం విద్యా స్వేచ్ఛకు, చర్చా స్వేచ్ఛకు వ్యతిరేకమని జెఎన్‌యుఎస్‌యు స్పష్టం చేసింది. ఆడిటోరియంను కేటాయించకపోయినా బహిరంగ ప్రదేశంలో చర్చను కొనసాగిస్తామని పేర్కొంది. తెలుసుకునే, ప్రశ్నించే , చర్చించే తమ హక్కును కాపాడుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చింది.







కామెంట్‌లు (0)