మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మెడికో ప్రియాంక మృతి

09 ఆగస్టు, 2026

priyanaka
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 09, 2026, 11:15 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- ధ్రువీకరించిన కిమ్స్‌ వైద్యులు

- ఆమె కుటుంబానికి 
రూ.20 లక్షలు ఆర్థిక సాయం

- సిఎం చంద్రబాబు ఆదేశం

ప్రజాశక్తి- హైదరాబాద్‌, అమరావతి బ్యూరో, రాజమహేంద్రవరం ప్రతినిధి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందారు. వెంటలేటర్‌‌పై చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం మధ్యాహ్నం 3.25 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు హైదరాబాద్ కిమ్స్‌ ‌వైద్యులు బులిటెన్‌ ‌విడుదల చేశారు. ప్రియాంక పార్థివ దేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. రాజమహేంద్రవరం పోలీసులు, ప్రియాంక తండ్రి వెంకటేష్‌ వచ్చిన తర్వాత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షలు ఆర్థిక సాయం అందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ప్రియాంక స్వస్థలం తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఏక్లాస్‌పూర్. ఎంబిబిఎస్‌ పూర్తి చేసిన ఆమె తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జిఎస్‌ఎల్‌ వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. తల్లిదండ్రులు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఈ నెల మూడున రాత్రి ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరంలోగల ప్రసాద్‌ ఆదిత్యమాల్‌లో సినిమా చూసి, సహచర విద్యార్థితో కలిసి ద్విచక్ర వాహనంపై ఆమె వస్తున్నారు. మద్యం మత్తులో కారు నడుపుతూ వచ్చిన దుష్యంత్‌, మరో వ్యక్తి ‌బలంగా ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో ప్రియాంక తీవ్రంగా గాయపడ్డారు. పైనుంచి కారు వెళ్లడంతో కిందపడిపోయిన ఆమె తలకు తీవ్ర గాయమైంది. ఆమెను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్ప్రతిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో ఈ నెల ఐదున సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది.

నిందితులకు కఠిన శిక్షలు తప్పవు : సిఎం

మద్యం మత్తులో యువకుల నిర్లక్ష్య డ్రైవింగ్‌కు బలైన వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ వైద్యురాలు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఎక్స్‌ వేదికగా ఆదివారం పేర్కొన్నారు. ప్రియాంక మృతికి కారణమైన నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనకు కారణమైన యువకులను ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు పంపినట్లు ఆయన గుర్తు చేశారు. ప్రియాంక కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన చంద్రబాబు, ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. దీనికి ముందు తూర్పుగోదావరి జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రియాంకకు ప్రమాదం జరిగిన అనంతరం రాజమండ్రిలో చికిత్స అందించడం, తరువాత కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించిన విషయాన్ని అధికారులు ఆయనకు వివరించారు. రాజకీయ ఒత్తిళ్లు లేవు హత్యాయత్నం కింద కేసు మార్పు : ఎస్‌పి మెడికో ప్రియాంక కేసులో పోలీసు శాఖపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లూ లేవని తూర్పు గోదావరి జిల్లా ఎస్‌పి డి.నరసింహకిశోర్ స్పష్టం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రియాంక కేసును పూర్తి నిష్పక్షపాతంగా, పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు సూరవరపు దస్వంత్‌, దేశబత్తుల ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్‌ ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారని తెలిపారు. ఈ ఘటనపై తొలుత సెక్షన్‌ 125 (బి) (రోడ్డు ప్రమాదం) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. అన్ని ఆధారాలనూ పరిశీలించిన అనంతరం ఇది హత్యాయత్న చర్యగా నిర్ధారించి కేసును సెక్షన్‌ 110 (హత్యాయత్నం) కిందకు మార్చినట్లు తెలిపారు. దర్యాప్తు వేగవంతం చేసి త్వరగా ఛార్జిషీటు దాఖలుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కఠిన చర్యలు తీసుకోవాలి : ప్రియాంక తండ్రి వెంకటేష్‌ తన కుమార్తెను కారుతో ఢీకొట్టిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రియాంక తండ్రి వెంకటేష్‌ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన రాజమహేంద్రవరంలోని ప్రకాశ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో వెంకటేష్ మాట్లాడారు. 'నా బాధను మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా రావడం లేదు` అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇంతటి దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి చట్టంపై ప్రజలకు నమ్మకం పెరిగేలా ప్రభుత్వం వ్యవహరించాలని కోరారు. వారం వారం హైదరాబాద్ వచ్చే సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ లకు ఆస్పత్రిలో ఉన్న ప్రియాంకను పరామర్శించే సమయం కూడా లేకపోవడం దారుణమన్నారు. ఇంత ఘోరం జరిగినా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచిగానీ, ప్రజాప్రతినిధుల నుంచిగానీ ఒక్క ఫోన్‌ కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ప్రభుత్వంపై తనకు ఇంకా నమ్మకం ఉందని, ఆలస్యం చేయకుండా తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వెంకటేష్ కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్