ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నా బిడ్డకు న్యాయం చేయండి : ప్రభుత్వానికి డాక్టర్ ప్రియాంక తండ్రి వెంకటేష్

1 గంట క్రితం

"Ensure justice for my daughter": Dr. Priyanka's father, Venkatesh, appeals to the government.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 09, 2026, 05:05 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : తన కుమార్తె డాక్టర్‌ ప్రియాంకను కారుతో ఢీకొట్టిన ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె తండ్రి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజమహేంద్రవరం ప్రకాశ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఆయన.. తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై మీడియా ఎదుట తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.నా బాధను మాటల్లో చెప్పలేకపోతున్నాను.. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా రావడం లేదు’ అంటూ వెంకటేష్ భావోద్వేగానికి గురయ్యారు.ప్రియాంక పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, తమ కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉందని వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి దారుణానికి పాల్పడిన వారు సాధారణంగా బయట తిరుగుతూ తమ జీవితాలను కొనసాగించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో చట్టంపై నమ్మకం పెరిగేలా ప్రభుత్వం వ్యవహరించాలని కోరారు. తమ కుటుంబంలో తొలి డాక్టర్‌గా ఎదగాల్సిన అమ్మాయి అని వెంకటేష్ తెలిపారు. సుమారు 30 ఏళ్లుగా ఎన్నో కష్టాలు, ఆర్థిక భారాన్ని భరిస్తూ ఆమెను చదివించామని చెప్పారు. వైద్య విద్యను పూర్తి చేసి మంచి స్థాయికి చేరుతుందని, ఆమెను చూసి కుటుంబంలోని ఇతర పిల్లలు కూడా వైద్యం, ఇంజినీరింగ్‌ వంటి ఉన్నత విద్య వైపు అడుగులు వేస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నామని చెప్పారు. తమకు ముగ్గురు కుమార్తెలే ఉన్నారని, కుమారుడు లేడని పేర్కొన్న వెంకటేష్.. అక్కాచెల్లెళ్ల వివాహాల తర్వాత కుటుంబానికి అండగా ఉంటానని ప్రియాంక చెప్పేదని గుర్తు చేసుకున్నారు. కుటుంబానికి భవిష్యత్తులో అండగా నిలుస్తుందనుకున్న కుమార్తె పరిస్థితి ఇలా మారిపోవడంతో తమ ఆశలన్నీ ఒక్కసారిగా కూలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని వెంకటేష్ కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ స్పందించి తమ కుటుంబాన్ని పరామర్శించాలని విజ్ఞప్తి చేశారు. ఇంతటి ఘటన జరిగినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఫోన్‌ కాల్‌ గానీ, ఆసుపత్రికి వచ్చి పరామర్శించడం గానీ, అధికారికంగా స్పందించడం గానీ జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ప్రియాంకకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ప్రభుత్వం తక్షణ సహాయం చేయాలని కోరారు. మహిళా విద్యార్థి, వైద్య విద్యను అభ్యసిస్తున్న యువతికి జరిగిన ఈ ఘటనపై మహిళా, హోంశాఖకు చెందిన ఉన్నతాధికారులు మానవీయంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.తమకు ప్రభుత్వంపై ఇంకా నమ్మకం ఉందని, అయితే న్యాయం జరిగేలా అధికారులు ఇకపై ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని వెంకటేష్ కోరారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలను మరింత పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్