రాజమండ్రి : మద్యం మత్తులో యువకులు.. వైద్య విద్యార్థిని ప్రియాంకను కారుతో ఢీకొట్టిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఘటనపై బాధితురాలి తండ్రి వెంకటేష్ రాజమహేంద్రవరంలోని ప్రకాశ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులు సూరావరపు దస్వంత్, ఆండ్రూ జోసఫ్ అడ్వర్డ్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘‘ ఈనెల 3న రాత్రి మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసిన నిందితులు మూడు సార్లు కారుతో ప్రియాంక స్కూటీని ఢీకొట్టారు. ప్రస్తుతం పోలీసులు పెట్టిన సెక్షన్లు తక్కువ తీవ్రతతో ఉన్నాయి. నిందితులకు కఠిన శిక్ష పడేలా సెక్షన్లు మార్చాలి ’’ అని కోరారు. జిల్లా అదనపు ఎస్పీ పాటిల్, డీఎస్పీ సుభాష్.. ఫిర్యాదుదారుతో చర్చిస్తున్నారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. పోలీసులతో మాట్లాడిన తర్వాత ప్రియాంక తండ్రి వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ .... ప్రియాంక తలపై కారు ఎక్కించారని వైద్యులు తెలిపారని అన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, అవయవాలు క్రమంగా చెడిపోతున్నాయని వివరించారు. నిందితులు మద్యం తాగి ఆవేశంగా కారు నడిపారని, కారుతో తొక్కిస్తే చనిపోతారని తెలిసినా.. వేగంగా నడిపారని అన్నారు. నిందితులు ఉద్దేశపూర్వకంగానే తన కమార్తెను చంపే ప్రయత్నం చేశారనీ, తన కుమార్తె భవిష్యత్తు నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. దర్యాప్తుపై అనుమానాలుంటే.. పోలీసులను అడిగి నివృత్తి చేసుకున్నామన్నారు. ప్రతి అంశాన్ని ఆధారాలతో సహా పోలీసులు క్షుణ్ణంగా వివరించారని తెలిపారు. పోలీసులపై నమ్మకం ఉందని.. న్యాయం జరుగుతుందని భావిస్తున్నానన్నారు. దర్యాప్తు సక్రమంగానే చేస్తున్నారనే నమ్మకం కలిగిందని తెలిపారు.
వైద్య విద్యార్థిని ప్రియాంకను కారుతో ఢీకొట్టిన ఘటన - కీలక పరిణామం
22 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 09, 2026, 12:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)