యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పి.ఎస్. విజయరామరాజు
ఘనంగా 52వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ప్రజాశక్తి–భీమవరం: అమరుల స్ఫూర్తితో ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం ఉద్యమాలు నిర్వహించాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పి.ఎస్. విజయరామరాజు పిలుపునిచ్చారు. భీమవరంలోని యుటిఎఫ్ జిల్లా కార్యాలయం వద్ద సోమవారం యుటిఎఫ్ 52వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాలకోడేరు మండల రిటైర్డ్ విద్యాశాఖ అధికారి హరి ఆనంద ప్రసాద్ యుటిఎఫ్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయరామరాజు మాట్లాడుతూ.. ‘అధ్యయనం–అధ్యాపనం–సామాజిక స్పృహ’ అనే నినాదంతో 1974 ఆగస్టు 10న అమరజీవులు చెన్నుపాటి లక్ష్మణరావు, రామిరెడ్డి, అప్పారి తదితర అనేకమంది ఉద్యమ నాయకుల స్ఫూర్తితో యుటిఎఫ్ ఏర్పడిందన్నారు. నాటి నుంచి నేటి వరకు అదే ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ లక్షకు పైగా సభ్యత్వంతో రాష్ట్రంలోనే పోరాటపటిమ కలిగిన ఏకైక సంఘంగా యుటిఎఫ్ నిలిచిందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం యుటిఎఫ్ నిరంతరం పోరాడుతోందని, భవిష్యత్తులోనూ మరింత ఐక్యంగా ఉద్యమాలను కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కె. శ్రీరామకృష్ణ ప్రసాద్, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు జి. అబ్రహం, భీమవరం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం. నరసింహయ్య, బి. నాగబాబు, పాలకోడేరు మండల ప్రధాన కార్యదర్శి కె. త్రిమూర్తులు, భీమవరం టౌన్ ప్రధాన కార్యదర్శి కె. మల్లేశ్వరరావు, ఎం.ఎం. పాషా, కె. సత్యనారాయణ, కె. సూర్యతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)