- కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్
ప్రజాశక్తి -గుంటూరు : విద్యార్థులు వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలపై దృష్టి సారించి, దేశానికి అవసరమైన సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడంతోపాటు, ప్రపంచ దేశాలు మెచ్చే విధంగా భారతదేశాన్ని ప్రపంచస్థాయి స్టార్టప్ హబ్‌గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆర్‌విఆర్ అండ్ జెసి ఇంజినీరింగ్ కాలేని మంత్రి పెమ్మసాని శుక్రవారం సందర్శించి కళాశాలలోని డి.ఎస్.టి, ఆర్.జే.ఈ. నెస్ట్ ఇంక్యుబేషన్ సెంటర్, ఇన్నోవేషన్ సెంటర్, ఏఐసీటీఈ-ఐడియా ల్యాబ్ తదితర పరిశోధనా, సాంకేతిక కేంద్రాలను పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో విద్యార్థులు చేపడుతున్న ప్రాజెక్టులు, పరిశోధనలు, ప్రయోగాలు, వినూత్న ఆవిష్కరణలను పరిశీలించి, విద్యార్థులు మరియు నిపుణులతో వాటి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక విద్యను కేవలం ఉద్యోగం సాధించేందుకు మాత్రమే పరిమితం చేయకుండా, తమ జ్ఞానం, నైపుణ్యాలు, వినూత్న ఆలోచనలను ఉపయోగించి ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలని సూచించారు. విద్యార్థులు తమ సృజనాత్మక ఆలోచనలను ఆవిష్కరణలుగా మలచి, అంకుర పరిశ్రమలను స్థాపించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. స్టార్టప్‌లు, ఇన్నోవేషన్‌లు, పరిశోధనలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ సహాయ సహకారాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులను ఇన్నోవేటర్లు, ఎంట్రపెన్యూర్లుగా, స్టార్టప్ వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దేందుకు ఆర్‌విఆర్‌లో ఆధునిక సాంకేతిక, పరిశోధనా, ఇంక్యుబేషన్ వసతులు ఉన్నాయని అభినందించారు. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ విద్యార్థులకు సాంకేతిక విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్, ఇతర నైపుణ్యాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, సెక్రటరీ రాయపాటి గోపాల కృష్ణ, ప్రిన్సిపాల్ డాక్టర్ కొల్లా శ్రీనివాస్, డైరెక్టర్లు డాక్టర్ కె.రవీంద్ర, డాక్టర్ ఎన్.వి.శ్రీనివాసరావు విభాగాధిపతులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)