- దేశాభివృద్ధికి, విప్లవోద్యమానికి అదే ప్రధాన ఆటంకం
- కులతత్వంతో పాలకులు రాజకీయం.. పెట్టుబడిదారులు దోపిడీ
- సీతారాం ఏచూరి స్మారకోపన్యాసంలో బివి రాఘవులు
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : కులవ్యవస్థ పోతేనే అమెరికా, చైనా మాదిరిగా మన దేశం కూడా సూపర్ పవర్‌గా ఎదగడం సాధ్యమవుతుందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు స్పష్టం చేశారు. దేశాభివృద్ధికి, విప్లవోద్యమానికి కులమే ప్రధాన ఆటంకంగా మారిందని తెలిపారు. అది ప్రజలు ఐక్యం కాకుండా నిలువునా చీల్చుతోందని పాలకులు సైతం అదే కావాలని కోరుకుంటున్నారని విమర్శించారు. పెట్టుబడిదారుల దోపిడీకి కూడా అది ఒక ఆయుధంగా మారిందని చెప్పారు. మన దేశంలో బలంగా పాతుకుపోయిన కులవ్యవస్థ పోవాలంటే కుల వ్యతిరేక, ఆర్థిక పోరాటాలు జమిలిగా సాగాలని, ఆ దిశగా కలిసొచ్చే శక్తులను కలుపుకుని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం సీతారాం ఏచూరి రెండో వర్థంతి సభ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు టి జ్యోతి అధ్యక్షతన జరిగింది. ‘కుల నిర్మూలన-మార్క్సిస్టు దృక్పథం’ అనే అంశంపై బివి రాఘవులు స్మారకోపాన్యాసం చేశారు. లౌకిక, ప్రజాస్వామిక, భారత రాజ్యాంగ విలువలను కాపాడేందుకు, దేశంలో మతోన్మాద శక్తులను ప్రాబల్యాన్ని తగ్గించేందుకు సీతారాం ఏచూరి ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. మావో మార్క్సిజాన్ని చైనా పరిస్థితులకు అన్వయించి విప్లవాన్ని తీసుకురావడంలో అక్కడి పార్టీ సక్సెస్ అయ్యిందని చెప్పారు. అదే మన దేశంలో వేళ్లూనుకుని పాతుకుపోయిన కుల వ్యవస్థ విప్లవోద్యమానికి ప్రధాన ఆంటకంగా మారిందని చెప్పారు. మహిళలు, దళితులు, వెనుబడిన తరగతుల వారికి చదువే అవసరంలేదని కులం చెబుతోందని, అలాంటప్పుడు దేశం ఎలా ముందుకు పోతుందని ప్రశ్నించారు. మన కంటే చిన్న దేశాలు ఉత్పాదకతలో, జిడిపిలో ఎంతో ముందు వరుసలో ఉన్నాయని, మన దేశం అలా ఎదగకపోవడానికి కులం కూడా ఒక కారణమని చెప్పారు. దేశంలో మతోన్మాద శక్తుల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని చెప్పారు. బ్రాహ్మణులు తెలివిగలవాళ్లు.. శూద్రులు తెలివితక్కువ వాళ్లు అని ఢిల్లీ ఐఐటి ప్రాంగణంలో పోస్టర్లు ప్రత్యక్షం కావడం పట్ల రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్‌లో ఎఐసిసి అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ఉపన్యాసం చేసిన వేదికను హిందూత్వ సంస్థకు చెందినవాళ్లు పసుపు నీళ్లతో శుద్ధి చేయడం ఎంతవరకు సబబు అని, అసలు మన దేశం ఎక్కడకు పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గద్వాల జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్న యువకుడి ఇంటిని కూల్చేయడాన్ని బట్టే పరిస్థితులు ఎటువైపు వెళ్తున్నాయో అర్థం చేసుకోవాలన్నారు. కుల వ్యవస్థ పోకపోతే అభివృద్ధి సాధ్యం కాదని ఆనాడే భక్తి ఉద్యమకారులు, గౌతమ బుద్ధుడు, అంబేద్కర్, ఫూలే, భగత్‌సింగ్, వివేకానందుడు, సింగారవేలు శెట్టియార్ తదితరులు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. పెట్టుబడిదారీ వ్యవస్థ కూడా తమ అధిక మిగులు కోసం, ప్రజల్ని చీల్చడం కోసం, అతి చౌకగా శ్రామికుల శ్రమను వాడుకోవడం కోసం కుల వ్యవస్థను వాడుకుంటున్న తీరును క్షుణ్ణంగా వివరించారు. బూర్జువా పార్టీలు మతం, కులం పేరుతో రాజకీయాలు చేస్తున్న తీరును ఎండగట్టారు. దేశాన్ని మళ్లీ వెనుకటి కాలానికి తీసుకెళ్లడానికి బిజెపి పాలకులు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి బలమైన కుల నిర్మూలన ఉద్యమాలు రావాలని, కుటుంబం నుంచే సంస్కరణ మొదలు కావాలని, ప్రతి ఒక్కరూ తమ పిల్లలను కుల, మతద్వేషాలు లేకుండా చైతన్యపూరితంగా పెంచే రోజులు రావాలని, కులాంతర వివాహాలు పెరగాలని ఆకాంక్షించారు. అలా అన్ని పాయలు కలిస్తేనే కులవ్యవస్థ నాశనం సాధ్యమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి ప్రభాకర్, హైదరాబాద్ సెంట్రల్‌సిటీ కార్యదర్శి ఎం వెంకటేశ్ పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)