ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అంధ మహిళా క్రికెటర్ల జీవితాలు ఆదర్శం

1 గంట క్రితం

asian
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 05:37 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- విశ్వ విజేతలను కలవడం గర్వంగా ఉంది

- గురుదేవ ట్రస్ట్ సేవలు అమూల్యం

- హిందుస్థాన్ షిప్ యార్డ్ భాగస్వామ్యం అద్భుతం

- మంత్రి కొండపల్లి శ్రీనివాస్

ప్రజాశక్తి-విజయనగరం టౌన్: దేశ క్రికెట్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడే విధంగా 2025 విశ్వవిజేతలుగా నిలిచిన అంధుల‌ మహిళా క్రికెటర్లను కలవటం చాలా గర్వంగా ఉందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళ పాలెం గురుదేవ ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకలలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన 2025 అంధుల‌ మహిళా క్రికెటర్లను ప్రతి ఒక్కరిని పేరుపేరునా పలకరిస్తూ పరిచయం చేసుకుని సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టుదల ఉంటే అంగవైకల్యం అడ్డు కాదని ప్రపంచానికి చాటి చెప్పిన అంధుల‌ మహిళా క్రికెటర్లను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. భారతదేశంలోని 12 రాష్ట్రాల నుండి ఎంపిక కాబడిన ఇండియన్ అంధుల‌ మహిళ క్రికెట్ సభ్యుల ఒక్కొక్కరి జీవిత గాధలు తెలుసుకుంటే వారి నుంచి స్ఫూర్తి పొంది ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ జట్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన కెప్టెన్ దీపిక, కరుణ కుమారి ఉండటం గర్వకారణంగా చెప్పుకోవచ్చు. అలాగే మన అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంట్లమామిడి గ్రామానికి చెందిన ఉత్తరాంధ్ర ప్రాంత బిడ్డ కరుణకుమారి కావటం, ఫైనల్ లో అద్భుతమైన ప్రదర్శనతో జట్టు విజయానికి కీలకంగా నిలవటం మరింత గర్వకారణంగా ఉందని మంత్రి కొండపల్లి పేర్కొన్నారు. ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని ఉరిమే ఉత్సాహంతో మరింతగా క్రీడల్లో రాణించాలని, ఆంధ్రప్రదేశ్లో క్రీడాకారులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. అలాగే గురుదేవా ట్రస్ట్ వారు చేపడుతున్న సేవా కార్యక్రమాలు అమూల్యమని అన్నారు. మూడు లక్షల మందికి పైగా విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ కాళ్లు (ప్రోస్టెటిక్స్) అందజేసి దేశంలోనే నాలుగో స్థానంలో ఉండటం ఈ ట్రస్ట్ మన విజయనగరం జిల్లాలో ఉండటం మరింత గర్వకారణం అన్నారు. అలాగే విభిన్న ప్రతిభావంతులకు కావలసిన అనేక రకాల సదుపాయాలు కల్పించడంతో పాటు వీల్ చైర్స్, ట్రై సైకిల్స్, కృత్రిమ అవయవాలు, వాకర్లు మరియు చేతి కర్రలు సంస్థ ద్వారా అందించడం వారి సేవా నిరతని తెలియజేస్తుందన్నారు. అలాగే గురుదేవ ట్రస్ట్ ద్వారా క్యాన్సర్ వైద్య సేవలు అందించడం కూడా శుభపరిణామం అన్నారు. విశ్వ విజేతలను తీసుకురావడంతో పాటు వారు గెలుచుకున్న ప్రపంచ కప్ ను సైతం నిర్వాహకులతో మాట్లాడి తీసుకురావడం గురుదేవ ట్రస్ట్ యొక్క విధానాన్ని తెలియజేస్తుందన్నారు. ప్రపంచ కప్ మహిళ అంధుల‌ విజేతలకు హిందుస్థాన్ షిప్ యార్డ్ భాగస్వామ్యం చాలా అద్భుతమనీ, జట్టులోని 16 మందికి ఒక్కరికి 50 వేల రూపాయల నగదు ప్రోత్సాహం అందించడం పట్ల హిందుస్థాన్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల చైర్మన్ గుడిపూడి నారాయణస్వామి, హిందుస్థాన్ షిప్ యార్డ్ ఫైనాన్స్ అండ్ కమర్షియల్ డైరెక్టర్ కిరణ్, ఇండియన్ బ్లైండ్ ఉమెన్ క్రికెట్ చైర్మన్ అజయ్ రెడ్డి, గురుదేవా ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు, డాక్టర్ ఫణీంద్ర, ట్రస్ట్ మెంబర్ బి ఎన్ రావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్