గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎంపిపి ఎన్నికల్లో ప్రలోభాలు

2 గంటల క్రితం

IMG-20261119-WA0002.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 10:28 అపరాహ్నం | 4 నిమిషాల చదవడం

  • తమ సభ్యులను కొనుగోలు చేశారని, బంధించారని వైసిపి ఆరోపణ

  • ‘కూటమి’లో బయటపడ్డ విభేదాలు

ప్రజాశక్తి - యంత్రాంగం : ఎంపిపి ఎన్నికల్లో కూటమి ప్రలోభాలకు పాల్పడింది. తమ పార్టీ ఎంపిటిసి సభ్యులను కొనుగోలు చేశారని, అధికార టిడిపికి అనుకూలంగా అధికారులు వ్యవహరించారని వైసిపి ఆరోపించింది. కూటమి పార్టీలోని విభేదాలు కూడా బట్టబయలయ్యాయి. తాడిమర్రిలో బిజెపికి టిడిపి ఝలక్‌ ఇచ్చింది. యు.కొత్తపల్లిలో జనసేనలో అంతర్గత విభేదాలతో ఎంపిపి ఎన్నిక వాయిదా పడింది. వైసిపికి, కూటమికి సమానంగా బలం ఉన్న కొన్ని మండలాల్లో ఎన్నికలను అధికారులు వాయిదా వేశారు.

శింగనమలలో మా ఎంపిటిసిలను ఇద్దరిని టిడిపి వారు బంధించారు : వైసిపి ఆరోపణ

అనంతపురం జిల్లా శింగనమల మండలం అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక ఉత్కంఠగా జరిగింది. ఈ మండలంలో 12 ఎంపిటిసి స్థానాలుండగా ఆరు స్థానాలు టిడిపి, ఆరు స్థానాలు వైసిపి గెలుపొందాయి. ఎంపిపి ఎన్నిక సమయంలో ఆరుగురు టిడిపి ఎంపిటిసి సభ్యులు, నలుగురు వైసిపి ఎంపిటిసి సభ్యులు మాత్రమే హాజరవ్వడంతో టిడిపి నుంచి హరిత ఎంపిపిగా విజయం సాధించినట్టు అధికారులు ప్రకటించారు. తమ పార్టీకి చెందిన ఇద్దరి ఎంపిటిసి సభ్యులను వేరే గదిలో నిర్బంధించి ఎంపిపి పీఠాన్ని టిడిపి కైవసం చేసుకుందని వైసిపి నాయకులు ఆరోపించారు. దీనికి ముందు అధ్యక్ష పదవిని టిడిపికి చెందిన తులసిరెడ్డికి ఇవ్వాలంటూ ఆయన మద్దతుదారులు అనంతపురం నగరంలోని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి నివాసం వద్ద ఆందోళనకు దిగారు. పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామంటూ హల్‌‌చల్‌ చేశారు. పోలీసులు వారిని నిలువరించారు.

తలుపుల, కదిరిలో వైసిపి గైర్హాజరు

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలంలో చెరి ఐదు, తలుపులలో చెరి ఆరు ఎంపిటిసి స్థానాలు టిడిపి, వైసిపిలకు వచ్చాయి. వైసిపి ఎంపిటిసి సభ్యులు గైర్హాజరు కావడంతో ఈ రెండు మండలాల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు టిడిపికి దక్కాయి.

తాడిమర్రిలో బిజెపికి టిడిపి ఝలక్‌!

శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి ఎంపిపి ఎన్నికలో బిజెపికి టిడిపి ఝలక్‌ ఇచ్చింది. కూటమి పొత్తులో భాగంగా ఎంపిపి స్థానాన్ని తొలుత బిజెపికి కేటాయించారు. ఈ మండలంలో తొమ్మిది ఎంపిటిసి స్థానాలకుగానూ ఐదు టిడిపి, ఒకటి బిజెపి, మూడు వైసిపి గెల్చుకున్నాయి. ఒక్క స్థానమున్న బిజెపికి అధ్యక్ష స్థానం ఇవ్వడానికి టిడిపి ఎంపిటిసి సభ్యులు అంగీకరించలేదు. దీంతో, టిడిపి నుంచే ఎంపిపి, వైస్‌ ఎంపిపి ఎన్నిక అయ్యారు.

జనసేనలో అంతర్గత విబేధాలతో ఎన్నిక వాయిదా

డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్‌ ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలోని యు.కొత్తపల్లి మండలంలో జనసేనలో అంతర్గత విబేధాలతో ఎంపిపి ఎన్నిక వాయిదా పడింది. గంటా విజయకుమార్‌ను ఎంపిపి అభ్యర్థిగా జనసేన ప్రకటిస్తూ విప్ జారీ చేసింది. దీనిపై అదే పార్టీకి చెందిన ఎంపిటిసి సభ్యులు ధనబాబు, ఆయన మద్దతుకు ఇస్తున్న ఎంపిటిసి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మొత్తం 24 మంది ఎంపిటిసి సభ్యుల్లో 16 మంది ఎంపిటిసి సభ్యుల మద్దతు తనకు ఉందని, ఎంపిపి ఎన్నిక నిర్వహించాలని ధనబాబు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇరుగ్రూపుల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో అధికారులు ఎన్నికను వాయిదా వేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జనసేన పార్టీ మండల అధ్యక్షుడు రావు అక్షయ్ ఆధ్వర్యంలో ధనబాబు, ఆయనకు మద్దతు తెలిపిన ఎంపిటిసిలు ఎంపిడిఒ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.

ఎంపిటిసిని రూ.30 లక్షలకు కొన్న టిడిపి : వైసిపి

పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఎంపిపి ఎన్నికలో ఉత్కంఠ చోటు చేసుకుంది. టిడిపికి ఏడు, వైసిపికి ఏడు ఎంపిటిసి స్థానాలు వచ్చాయి. వైసిపి నుంచి గెలుపొందిన పి.ఆమిటి ఎంపిటిసి సభ్యుడు మూటక లక్ష్మయ్య ఎంపిపి ఎన్నిక సమయంలో గైర్హాజరయ్యారు. దీంతో, టిడిపికి ఎంపిపి పీఠం దక్కింది. ఈ ఎన్నికను వాయిదా వేయాలని వైసిపి ఆందోళనకు దిగింది. తమ పార్టీ ఎంపిటిసి సభ్యుడిని టిడిపి రూ.30 లక్షలకు కొనుగోలు చేసిందని ఆరోపించారు.

తొట్టంబేడులో ఎంపిపి పీఠం కోసం బిజెపి పట్టు

ఒక్క ఎంపిటిసి స్థానం మాత్రమే గెలుపొందిన బిజెపి... తిరుపతి జిల్లా తొట్టంబేడు ఎంపిపి పీఠం కోసం పట్టుబట్టడంతో కూటమిలో విభేదాలు బహిర్గతం అయ్యాయి. మొత్తం 12 ఎంపిటిసి స్థానాలకుగానూ టిడిపి ఐదు, వైసిపి నాలుగు స్థానాల్లోనూ, సిపిఎం, జనసేన, బిజెపి ఒక్కొక్క స్థానంలోనూ గెలుపొందాయి. మెజార్టీ స్థానాలు వచ్చిన తమకే ఎంపిపి పీఠం ఇవ్వాలని టిడిపి డిమాండ్‌ చేసింది. ఈ నేపథ్యంలో గందరగోళం నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎంపిపి ఎన్నికను వాయిదా వస్తున్నట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు.

అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలం రాచవేటివారిపల్లి టిడిపి ఎంపిటిసి సభ్యులు ఆర్.మాధవి లత, ముష్టూరు జనసేన ఎంపిటిసి సభ్యులు ఎం.మాలతి కనిపించడం లేదంటూ టిడిపి నాయకులు ఆందోళనకు దిగారు. వైసిపి నాయకులే వారిద్దరినీ కనిపించకుండా చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎంపిపి ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు.

డ్రాలో మోసం జరిగింది : వైసిపి

నెల్లూరు జిల్లా ​సైదాపురంలో మొత్తం 12 ఎంపిటిసి స్థానాలకుగానూ చెరో ఆరు స్థానాలు రావడంతో డ్రా తీశారు. చీటీలను పూర్తిస్థాయిలో కలపకుండానే డ్రా తీసి టిడిపి అభ్యర్థి పొట్టేళ్ల పార్వతి పేరును ఎంపిపిగా ప్రకటించారని వైసిపి సభ్యులు ఆరోపించారు. బాపట్ల ఎంపిపి ఎన్నిక వాయిదా పడడంతో ఎంపిడిఒ కార్యాలయం బయట టిడిపి, వైసిపి కార్యకర్తల మధ్య వివాదం చోటుచేసుకుంది.

వైసిపికి మెజార్టీ ఉన్న బాపట్లలో ఎంపిపి ఎన్నిక వాయిదా

వైసిపికి మెజార్టీ ఎంపిటిసి సభ్యులు ఉన్న బాపట్లలో ఎంపిపి ఎన్నిక వాయిదా పడింది. మొత్తం 15 మంది ఎంపిటిసి సభ్యులకుగానూ వైసిపి నుంచి ఎనిమిది మంది, టిడిపి నుంచి ఏడుగురు గెలుపొందారు. ఎంపిపిని ఎన్నుకోవడానికి వారంతా గురువారం మధ్యాహ్నం 12 గంటలకు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే, ఎంపిపి ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. ఎంపిటిసి సభ్యులు ప్రమాణ స్వీకారానికి, ఎంపిపి ఎన్నికలకు సహకరించకుండా గొడవ చేయడంతో ఎన్నిక వాయిదా వేశామని ఎన్నికల అధికారి బి.సింగయ్య వివరణ ఇచ్చారు. ​

వైస్ ఎంపిపి పదవి కోసం జనసేన ఆందోళన

ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండల వైస్ ఎంపిపి పదవి జనసేన నాయకులు ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేనకు వైస్ ఎంపిపి పదవి ఇవ్వడానికి ముందుగానే ఒప్పందం జరిగిందన్నారు. దీనికి భిన్నంగా ఆ పదవిని బిజెపికి కేటాయించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసు బందోబస్తు నడుమ జరిగిన ఎన్నికలో వైస్ ఎంపిపిగా బిజెపి అభ్యర్థిని ఎన్నుకున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్