- ఆహ్వాన పత్రంలో చేర్చని పేరు
- సభా ప్రాంగణం వద్ద కార్యకర్తల ఆందోళన
ప్రజాశక్తి – కర్నూలు క్రైమ్ : కర్నూలు నగరపాలక సంస్థ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం టిడిపి నాయకుల మధ్య అంతర్గత విభేదాలకు వేదికగా మారింది. ఒకవైపు స్వాగత ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో కర్నూలు, కోడుమూరు నియోజకవర్గాల టిడిపి నాయకుల అనుచరుల మధ్య వివాదం చెలరేగగా, మరోవైపు అధికారిక ఆహ్వాన పత్రంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పేరు లేకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
కర్నూలు నగరపాలక సంస్థ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి మున్సిపల్ అధికారులు ముద్రించిన ఆహ్వాన పత్రంలో మంత్రి టిజి భరత్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తదితరుల పేర్లు ముద్రించి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పేరును విస్మరించారు. ఆహ్వానం లేకపోయినా కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎమ్మెల్యే దస్తగిరి తన అనుచరులతో కలిసి వచ్చారు. అయితే, అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆయన వెనుదిరిగారు. ఈ క్రమంలో ఆగ్రహించిన కార్యకర్తలు సభా ప్రాంగణం వద్ద ఆందోళనకు దిగారు. డిప్యూటీ టౌన్ ప్లానర్ బయటకు వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా కార్యకర్తలు శాంతించలేదు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు అధికారులు జోక్యం చేసుకుని ఎమ్మెల్యేను, కార్యకర్తలను సముదాయించారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తామని, ఫ్లెక్సీలు చించిన వారిపై సాయంత్రంలోగా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ టౌన్ ప్లానర్ హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. మరోవైపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పార్టీ నాయకులకు స్వాగతం పలుకుతూ ఆదివారం రాత్రి నగరంలోని సుంకేసుల రోడ్డు రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద తమ నాయకుల ఫొటోలతో కోడుమూరు నియోజకవర్గ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, కర్నూలు నియోజకవర్గానికి చెందిన ఓ ముఖ్య నాయకుడి అనుచరులు వాటిని చించివేయడంతో కోడుమూరు కార్యకర్తలు నిరసనకు దిగారు. ఫ్లెక్సీలను తిరిగి ఏర్పాటు చేసినప్పటికీ, మున్సిపల్ అధికారులు వాటిని తొలగించారు.








కామెంట్లు (0)