గురువారం, 26 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పుస్తక పఠనంతో మేధో వికాసం

5 రోజుల క్రితం

పుస్తక పఠనంతో మేధో వికాసం 
- పిల్లలు బుక్‌ రీడింగ్‌‌ను జీవితంలో భాగం చేసుకోవాలి 
- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 09:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- పిల్లలు బుక్‌ రీడింగ్‌‌ను జీవితంలో భాగం చేసుకోవాలి

- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

ప్రజాశక్తి - విశాఖ : పిల్లలు పుస్తక పఠనాన్ని వారి జీవితంలో భాగంగా చేసుకోవాలని, పుస్తకాలు చదవడం వల్ల ఆలోచనా పరిధి విస్తరించడంతో పాటు మేధస్సు వికసిస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు అన్నారు. లిట్‌లాంట్రన్ ఫర్ కల్చర్ అండ్ లిటరేచర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏడో ఎడిషన్ వైజాగ్ జూనియర్ లిటరరీ ఫెస్ట్ (విజెఎల్ఎఫ్)-2026 శనివారం విశాఖపట్నంలోని హవా మహల్‌లో ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా హాజరైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్, ఇతర ప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు పెద్ద ఎత్తున సాహిత్య ఉత్సవాన్ని నిర్వహిస్తున్న లిట్‌లాంట్రన్ సంస్థ నిర్వాహకులను అభినందించారు. చిన్నతనం నుంచే పుస్తకాలు చదివే అలవాటు పెంపొందించుకోవడం ద్వారా సృజనాత్మకత, ఆలోచనా శక్తి అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ విద్యార్థులు పుస్తకాలు, పదాల ప్రపంచంలోకి అడుగుపెట్టి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలకు సమాజం నుంచి మరింత ప్రోత్సాహం అవసరమన్నారు. తొలిరోజు 4-7, 8-12, 13-16 ఏళ్ల వయసు పిల్లలతో పాటు ఉపాధ్యాయులు, పెద్దల కోసం మొత్తం 49 సెషన్లు నిర్వహించారు. మైమ్ కళాకారుడు కునాల్ మోట్లింగ్ ప్రదర్శనతో కార్యక్రమాలు ప్రారంభమై సందర్శకులను నవ్వుల్లో ముంచెత్తాయి. ఈ ఉత్సవంలో 20 మంది ప్రముఖ వక్తలు పాల్గొని తమ అనుభవాలను, రచనలను చిన్నారులతో పంచుకున్నారు. రచయితలు సంజయ్ అరోరా, శ్వేతా తనేజా, వికాస్ ప్రకాశ్ జోషి, మేనకా రామన్, వర్ష శేషన్, అనుష్క రవిశంకర్ వారి పుస్తకాల గురించి వివరించారు. ఇలస్ట్రేటర్లు కనాటో జిమో, సోనాల్ గుప్తా వాస్వానీ, మోనికా టాటా, కథకులు వినీతా జుట్షి, వనితా షా, నేహా సింగ్, లోపాముద్ర మొహంతి ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. పప్పెటీర్ ఆకాంక్ష దత్తా నిర్వహించిన కార్యక్రమాలతో పాటు పద్మినీ రంగరాజన్ తెలుగులో నిర్వహించిన తోలుబొమ్మలాట సెషన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వికలాంగుల కోసం ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేయడం విశేషం. ఆయిషా, కునాల్ మోట్లింగ్, క్లౌన్ రాహుల్ వివిధ అంశాలపై వర్క్‌షాప్‌లు నిర్వహించారు. చెన్నయ్‌‌కు చెందిన క్రియా ప్లే థియేటర్ బృందం ప్రదర్శించిన నాటకంతో తొలిరోజు కార్యక్రమాలు ముగిశాయి. ఇక భారతీయ ప్రచురణకర్తలకు చెందిన వెయ్యికి పైగా పుస్తకాలతో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనకు సందర్శకుల నుంచి విశేష స్పందన లభించింది. విద్యార్థులు వారి అభిమాన రచయితలను నేరుగా కలుసుకుని, పుస్తకాలపై ఆటోగ్రాఫ్‌లు తీసుకునేందుకు ఉత్సాహం చూపారు. 2018 నుంచి నిర్వహిస్తున్న ఈ ఉత్సవం దేశంలోని ప్రముఖ ఏడు బాలల సాహిత్య ఉత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందిందని ఫెస్ట్ డైరెక్టర్లు సోనాల్ సర్దా, ప్రియా గోపాలకృష్ణన్, సంధ్య గోడే తెలిపారు. ఉత్సవానికి అందరికీ ఉచిత ప్రవేశం కల్పించినట్లు వెల్లడించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్