బుధవారం, 18 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవడ్డీ రేట్లకు మళ్లీ రెక్కలు..!

2 గంటల క్రితం

Huge cash reserves in banks – RBI's key measures
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 09:57 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • 75 బేసిస్ పాయింట్లు పెరగొచ్చు

  • జిడిపి 7.2 శాతానికి తగ్గొచ్చు

  • గోల్డ్‌మన్ శాక్స్ అంచనా..

న్యూఢిల్లీ : రోజు రోజుకు పెరుగుతోన్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో ఆర్‌‌బిఐ మరోసారి వడ్డీ రేట్లను పెంచొచ్చని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. 2027 క్యాలెండర్ సంవత్సరం రెండో త్రైమాసికం (క్యూ2) నాటికి రెపో రేటును మొత్తం 75 బేసిస్ పాయింట్లు పెంచి 6.25 శాతానికి చేర్చే అవకాశం ఉందని తన పరిశోధన నివేదికలో పేర్కొంది. ఈ డిసెంబర్‌లో 25 బేసిస్ పాయింట్లు, 2027 ప్రథమార్థంలో మరో 50 బేసిస్ పాయింట్ల మేర పెంపు ఉండవచ్చని విశ్లేషించింది. గత అక్టోబర్ ఆర్‌‌బిఐ సమీక్షలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చిన విషయం తెలిసిందే.

​అక్టోబర్ 2026లో దేశ రిటైల్ ద్రవ్యోల్బణం రెండేళ్లలో తొలిసారిగా ఆర్‌‌బిఐ నిర్దేశించిన గరిష్ఠ పరిమితి 6 శాతాన్ని దాటి 6.1 శాతానికి చేరింది. ఆహార ధరల పెరుగుదల, ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, ముడిసరుకుల వ్యయాలు అధికం కావడం వల్ల ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు మరింత విస్తరించే అవకాశం ఉందని గోల్డ్‌మన్ శాక్స్ చీఫ్ ఇండియా ఎకనామిస్ట్ శంతను సేన్‌గుప్తా పేర్కొన్నారు. 2026 చివరి త్రైమాసికం, 2027 తొలి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 6 శాతానికి పైనే కొనసాగవచ్చని నివేదిక అంచనా వేసింది. 2027 క్యాలెండర్ సంవత్సరంలో సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 5.7 శాతంగా ఉండవచ్చని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో ధరల నియంత్రణకు ఆర్‌‌బిఐ వడ్డీ రేట్ల పెంపు విధానాన్ని కొనసాగించవచ్చని తెలిపింది. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత గత అక్టోబర్‌‌లో తొలిసారి పావు శాతం వడ్డీ రేట్లను పెంచింది.

​వృద్ధి తగ్గొచ్చు..

​వడ్డీ రేట్ల పెంపు ప్రభావంతో భారత వాస్తవ జిడిపి వృద్ధి రేటు 2026లో అంచనా వేసిన 7.9 శాతం నుంచి 2027లో 7.2 శాతానికి తగ్గవచ్చని గోల్డ్‌మన్ శాక్స్ తెలిపింది. అయితే దేశీయ డిమాండ్, ప్రయివేటు వినియోగం, ఇంధనం, ముడి పదార్థాలు, వ్యూహాత్మక తయారీ రంగాల్లో పెట్టుబడులు ఆర్థిక కార్యకలాపాలకు కొంత మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. 2027లో వాస్తవ పెట్టుబడుల వృద్ధి 8.5 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రానున్న మూడు నెలల్లో 94కు, ఆరు నెలల్లో 95కు, ఏడాది కాలంలో 96కు చేరవచ్చని అంచనా వేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్