గురువారం, 27 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కాకినాడ – జోధ్‌పూర్ మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు ఏర్పాటు చేయండి

04 ఆగస్టు, 2026

MP Tangella
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 04, 2026, 04:16 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

కేంద్ర రైల్వే శాఖ మంత్రికి ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ విజ్ఞప్తి

ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ – జోధ్‌పూర్ మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రికి ఎంపి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ విజ్ఞప్తి చేశారు. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ఇటీవల కేంద్ర రైల్వే శాఖ కాకినాడ నుండి పలు ముఖ్య నగరాలకు కొత్త రైళ్లు ఏర్పాటు చేయడంతో పాటు అనేక ప్రత్యేక రైళ్లను రెగ్యులర్ రైళ్లు గా మార్చింది. తాజాగా జిల్లా కేంద్రం కాకినాడ టౌన్ నుండి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ వరకు కొత్త వారాంత ఎక్స్‌ప్రెస్ రైలును ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం కేంద్రమంత్రికి లేఖ రాశారు. జిల్లా ప్రజల డిమాండ్ మేరకు ఇప్పటికే ప్రవేశపెట్టిన కాకినాడ టౌన్–హిసార్ వారాంత ఎక్స్‌ప్రెస్ రైలు వల్ల ఉత్తర భారతదేశంతో రైల్వే అనుసంధానం మెరుగుపడిందని, ఇందుకు కేంద్ర రైల్వే శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ప్రస్తుతం నడుస్తున్న ఒక్క వారాంత రైలు పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలను తీర్చలేకపోతోందన్నారు. ప్రస్తుతం హిసార్ ఎక్స్‌ప్రెస్ ప్రధానంగా జైపూర్ మార్గంలో ప్రయాణిస్తోందని, జోధ్‌పూర్, జైసల్మేర్, బార్మేర్, పాలి, జాలోర్, భగత్ కి కోఠి వంటి పశ్చిమ రాజస్థాన్ ప్రాంతాలకు నేరుగా అనుసంధానం లేదని తెలిపారు. దీంతో ప్రయాణికులు జోదపూర్ కు చేరుకోవాలంటే జైపూర్, ఢిల్లీ, అహ్మదాబాద్ వంటి జంక్షన్లలో రైళ్లు మార్చుకోవాల్సి వస్తోందని, దీనివల్ల సమయం, ఖర్చు, అసౌకర్యం పెరుగుతున్నాయని వివరించారు. జోధ్‌పూర్ ఉత్తర–పశ్చిమ భారతదేశంలోని ప్రధాన రైల్వే జంక్షన్ కావడంతో అక్కడికి నేరుగా రైలు ఏర్పాటు చేయడం ద్వారా పశ్చిమ రాజస్థాన్ ప్రాంతాలకు సులభమైన రవాణా సౌకర్యం లభిస్తుందని ఎంపీ పేర్కొన్నారు. ఈ ప్రతిపాదిత రైలు ద్వారా కాకినాడ జిల్లాతో పాటు కోనసీమ, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు పరిసర ప్రాంతాల ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, ప్రజల దీర్ఘకాలిక డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన ఆమోదించాలని కేంద్ర రైల్వే మంత్రిని ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్