- రాష్ట్రానికి రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడులు
- సిఐఐ ప్రాంతీయ సదస్సులో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : పెట్టుబడులకు, పారిశ్రామికాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ భరోసా ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడలోని జెఎన్‌టియులో సోమవారం నిర్వహించిన సిఐఐ ప్రాంతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాకినాడలో రూ.6,347 కోట్ల పెట్టుబడులతో చేపట్టనున్న ప్రాజెక్టులు ఈ ప్రాంత పారిశ్రామిక ప్రగతికి కొత్త అవకాశాలను తీసుకొస్తాయన్నారు. వీటి ద్వారా కాకినాడ, పరిసర ప్రాంతాల్లో సుమారు 18 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. 2024 జూన్ నుంచి రాష్ట్రానికి 714 ప్రాజెక్టుల రూపంలో రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. వీటిలో రూ.16.6 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రభుత్వ అనుమతులు పూర్తయ్యాయని, రూ.4.7 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు కార్యరూపం దాల్చే దశకు చేరుకున్నాయని వివరించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో 7.1 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తల ద్వారా ఎంఒయులను అందుకున్నారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ‘సిఐఐ పార్ట్‌నర్ షిప్ సమ్మిట్’కు కాకినాడతో పాటు వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఈ ప్రాంతీయ సదస్సులు ప్రిపరేటరీ వర్క్‌షాప్‌లుగా ఉపయోగపడతాయని తెలిపారు. ఈ సమావేశాల ద్వారా రూపొందించే కామన్ కన్సాలిడేటెడ్ నివేదికలను విశాఖ సమ్మిట్‌లో ప్రవేశపెడతామన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి టిజి.భరత్ మాట్లాడుతూ ఐదు రీజియన్లలో సదస్సులను నిర్వహిస్తున్నామని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేస్తూ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి బిసి.జనార్ధన్ రెడ్డి, ఎంపీలు సానా సతీష్ బాబు, ఉదయ్ శ్రీనివాస్, హరీష్, సిఐఐ వైస్ ఛైర్మన్ జి.సాంబశివరావు, జిల్లా కలెక్టర్ హారేంధిర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సిపిఎం నాయకుల గృహనిర్బంధం
సిఐఐ ప్రాంతీయ సదస్సుకు పవన్ కల్యాణ్ హాజరు కానున్న నేపథ్యంలో కాకినాడ నగరంలో సిపిఎం నాయకులు జి.బేబీరాణి, దువ్వ శేషబాబ్జి, పలివెల వీరబాబులను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. సోమవారం తెల్లవారుజామున 5.30 గంటలకే పోలీసులు మఫ్తీలో నాయకుల ఇంటికి వచ్చి అక్కడే తిష్టవేశారు. పవన్ కల్యాణ్ కార్యక్రమం ముగిసిన తర్వాతే అక్కడి నుంచి వారు వెళ్లారు.











కామెంట్‌లు (0)