రిలయన్స్, గ్రీన్‌కో, క్లీన్‌మాక్స్, మెఘా, కియా సంస్థలు ఆసక్తి
ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో, ఎంవిపి.కాలనీ : విశాఖలో జరుగుతున్న 31వ సిఐఐ భాగస్వామ్య సదస్సు తొలి రోజు పెట్టుబడులు వెల్లువెత్తాయి. మొత్తం 73 అవగాహన ఒప్పందాలు (ఎంఒయులు), 15 ప్రభుత్వ ఉత్తర్వులు (జిఒలు) కలిపి 88 ఒప్పందాల ద్వారా రూ.5,84,355 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నట్టు ప్రకటించారు. వీటి ద్వారా 1,07,693 మందికి ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశముందని ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, రాష్ట్ర మంత్రుల సమక్షంలో వివిధ సంస్థల ప్రతినిధులు ఒప్పందాలు, ఉత్తర్వులను మార్చుకున్నారు. అధికారిక సమాచారం ప్రకారం.. తొలిరోజు కుదిరిన 73 ఎంఒయుల విలువ రూ.5,35,113 కోట్లు కాగా, వీటి ద్వారా 93,414 ఉద్యోగాలు కల్పించనున్నారు. మరో 15 జిఒల ద్వారా రూ.49,242 కోట్ల పెట్టుబడులు, 14,279 ఉద్యోగాల కల్పనకు మార్గం ఏర్పడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.2.73 లక్షల కోట్లతో తూర్పుగోదావరి జిల్లాలో పెట్టుబడి పెట్టనుండగా, రాష్మి మెటలర్జికల్ ఇండస్ట్రీ రూ.18,500 కోట్లు, జెఎస్‌డబ్ల్యూ గ్రూప్ రూ.15 వేల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చాయి. రంగాలవారీగా చూస్తే జనరల్ మాన్యుఫ్యాక్చరింగ్ విభాగంలో 23 ఎంఒయులు, ఐదు జిఒల ద్వారా రూ.3,57,386 కోట్ల పెట్టుబడులు, 44,838 ఉద్యోగాలు రానున్నాయి. పునరుత్పాదక ఇంధన రంగంలో ఏడు ఎంఒయులు, ఐదు జిఒల ద్వారా రూ.1,65,020 కోట్ల పెట్టుబడులు, 16,600 ఉద్యోగాలు రానున్నాయి. గ్రీన్‌కో ఎనర్జీస్ రూ.45 వేల కోట్లు, క్లీన్‌మాక్స్ ఎన్విరో ఎనర్జీ రూ.41 వేల కోట్లు, మేఘా ఇంజినీరింగ్ రూ.36 వేల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చాయి. ఆటోమొబైల్ రంగంలో నాలుగు ఎంఒయుల ద్వారా రూ.21,285 కోట్ల పెట్టుబడులు, 13,600 ఉద్యోగాలు కల్పించనున్నారు. ఇందులో కియా ఇండియా రూ.18,878 కోట్ల పెట్టుబడితో పెనుకొండలో ఏటా మరో రెండు లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనుంది. దీంతో సంస్థ మొత్తం ఉత్పత్తి సామర్థ్యం ఆరు లక్షల వాహనాలు దాటనుండగా, కొత్తగా 12 వేల ఉద్యోగాలు లభించనున్నాయి. రసాయనాలు, పెట్రోకెమికల్స్ రంగంలో రూ.19,995 కోట్లు, ఆహార శుద్ధి రంగంలో రూ.4,770 కోట్లు, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల రంగంలో రూ.4,300 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. ఏరోస్పేస్, రక్షణ రంగంలోనూ రూ.3,406 కోట్ల పెట్టుబడులతో పది ఒప్పందాలు కుదిరాయి. రాష్ట్రానికి వచ్చిన ప్రతి పెట్టుబడి హామీని ఉత్పత్తి ప్రారంభమయ్యే వరకు పర్యవేక్షిస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
12 వేల మందికి ఉద్యోగాలు : కియా ఇండియా సిఇఒ గ్వాంగ్ లీ
సిఐఐ భాగస్వామ్య సదస్సులో రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబు, కియా ఇండియా సిఇఒ గ్వాంగ్ లీ మధ్య ఎంఒయు జరిగింది. ఏడాదికి అదనంగా మరో రెండు లక్షల కార్ల ఉత్పత్తికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. సదస్సులో గ్వాంగ్ లీ మాట్లాడుతూ.. తాజా ఎంఒయు ద్వారా నేరుగా 12 వేల మందికి ఉద్యోగాలిస్తామన్నారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం విజయవంతమైందనటానికి కియా ఒప్పందమే తార్కాణమన్నారు. మేకిన్ ఇండియా ఉత్పత్తులను ప్రపంచానికి అందించేలా కియా పనిచేస్తుందని తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌లో భాగంగా ఎపి ప్రభుత్వంతో కలసి పనిచేస్తున్నామని తెలిపారు. పెనుకొండలో రూ.19 వేల కోట్లతో కియా సంస్థ మరో ప్లాంట్‌ను త్వరలో ప్రారంభించేందుకు ఒప్పందం కుదిరిందన్నారు. 2029 మే నాటికి ఈ రెండో ప్లాంట్‌ను సిద్ధం చేయనున్నట్టు వెల్లడించారు.
రాష్ర్టంతో భాగస్వామ్యం మరింత బలోపేతం: రిన్యూ ఎనర్జీ సిఇఒ సుమంత్ సిన్హా
‘ఎపిలో పది ప్రదేశాల్లో రిన్యూ ఎనర్జీ ఇప్పటికే 717 మెగావాట్ల పవన్ విద్యుత్, 60 మెగావాట్ల సౌర విద్యుత్తు సామర్థ్యంతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వీటి ద్వారా పది వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు ఏర్పడ్డాయి’ అని రిన్యూ ఎనర్జీ సిఇఒ సుమంత్ సిన్హా అన్నారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ.. 78.5 గిగావాట్ల సౌర విద్యుత్తు, 35 గిగావాట్ల పవన్ విద్యుత్తు, 25 గిగావాట్ల అవర్ల బ్యాటరీ ఇంధన నిల్వ లక్ష్యాలను సాధించే దిశగా ఎపి ప్రభుత్వంతో కలసి పనిచేస్తున్నట్లు తెలిపారు. తమ సంస్థ స్వచ్ఛ ఇంధన తయారీ రంగాల్లో రూ.80 వేల కోట్ల తాజా పెట్టుబడులకు ఈ సదస్సులో ప్రకటన చేసిందన్నారు. అనకాపల్లి, నెల్లూరు జిల్లాల్లో తమ ప్రాజెక్టులు రానున్నాయన్నారు.
రాష్ట్ర ప్రగతిని చాటేలా పెవిలియన్లు
సిఐఐ భాగస్వామ్య సదస్సు ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు, పారిశ్రామిక ప్రగతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి పియూష్ గోయల్, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లకు థింసా, తప్పెటగుళ్లు, గరగ నృత్యాలు, డప్పు వాయిద్యాలతో కళాకారులు స్వాగతం పలికారు. పారిశుధ్య కార్మికులను నేతలు అభినందించారు. అనంతరం ఎపి, ఎంఎస్ఎంఇ పెవిలియన్లను ప్రారంభించారు. రాష్ట్రంలోని పారిశ్రామిక అవకాశాలు, వ్యవసాయ ఉత్పత్తులు, స్వర్ణాంధ్ర విజన్, సోలార్ విద్యుత్తు ప్రాజెక్టులు, విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనమిక్ రీజియన్ల అభివృద్ధిని డిజిటల్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించారు. పెవిలియన్‌లో ఏర్పాటు చేసిన అరకు కాఫీ స్టాల్‌ను నేతలు సందర్శించి కాఫీని ఆస్వాదించారు. గిరిజన చిత్రకళలు, తోలుబొమ్మలాట, పెన్ కలంకారీ వంటి హస్తకళల ప్రదర్శనలను తిలకించారు. విదేశీ ప్రతినిధులు సైతం అరకు కాఫీ ప్రత్యేకతలను తెలుసుకుని ఆస్వాదించారు. వచ్చే భాగస్వామ్య సదస్సుకు ప్రతినిధులను అరకు కాఫీ తోటలకు తీసుకెళ్లి గిరిజనుల ఆతిథ్యం అందిస్తామని చంద్రబాబు తెలిపారు.







కామెంట్‌లు (0)