ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రుషికొండను ప్రయివేటుకు కట్టబెట్టడం దారుణం : సిపిఎం

11 గంటల క్రితం

jaggu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 11:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : రుషికొండ భవనాలను, కొండ పైభాగాన్ని, కింద భూములను ఆతిథ్య రంగం పేరుతో ప్రయివేటుకు కట్టబెట్టే టిడిపి కూటమి ప్రభుత్వ మంత్రివర్గ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు డిమాండ్ చేశారు. పిఠాపురం కాలనీ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణారావు, జిల్లా కమిటీ సభ్యులు ఎల్‌జె.నాయుడుతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టిడిపి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజా వనరులను తన రాజకీయ కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే చర్యలను వేగవంతం చేసిందన్నారు. తాజాగా విశాఖలోని రుషికొండను తన అనుయాయులకు ధారాదత్తం చేసేందుకు తెరలేపిందని విమర్శించారు. ఆసక్తి కలిగిన సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించే తంతు కూడా ప్రారంభించిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రుషికొండను వైసిపి బోడిగుండు చేసిందని, రూ.452 కోట్లతో ప్యాలెస్‌ నిర్మించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాక కోట్ల రూపాయలు దిగమింగారని గగ్గోలు పెట్టి, పర్యావరణం విధ్వంసం చేస్తున్నారని విమర్శలు గుప్పించారని అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌లు రుషికొండకు పర్యటనలపై పర్యటనలు చేసి తమ పార్టీ అనుయాయులతో హైకోర్టులో కేసులు వేయించారని గుర్తు చేశారు. తమ బాకా మీడియాతో ఎడతెరిపిలేని ప్రచారం చేయించి, రాజకీయ స్వార్థ క్రీడగా దీన్ని వినియోగించుకొని ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందారన్నారు. నిర్వహణ కింద ప్రతి నెలా రూ.25 లక్షలు ప్రజాధనం వృథా అవుతోందని ప్రచారం ప్రారంభించి, భవనాలను ఎలా ఉపయోగించాలో అధ్యయనం చేయటానికి మంత్రుల బృందం వేస్తున్నట్లు ప్రకటించారన్నారు. ఆ బృందం వీటిని ప్రయివేటుకు ఇవ్వాలనే భావనను మీడియా ద్వారా లీక్ చేసిందని, దీనిపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ప్రజాభిప్రాయ సేకరణ అనే నాటకానికి తెరలేపారని గుర్తు చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున రుషికొండ ప్యాలెస్‌ను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టకూడదని తెగేసి చెప్పారని, దీనిని పరిగణనలోకి తీసుకోకుండా పర్యాటక అభివృద్ధి, ఇంటర్నేషనల్ డెస్టినేషన్ వంటి మాయమాటలను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చిందని విమర్శించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్