భద్రతాపరమైన లోపాలను విస్మరించలేను
షర్మిలకు రాసిన లేఖను విడుదల చేసిన జగన్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : షర్మిల కుమార్తె అంజలి వివాహ వేదికకు సంబంధించి తాను ముందుగానే చెప్పినా కనీసం పట్టించుకోలేదని, భద్రతాపరమైన అంశాలు ఉండటంతో హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో పెళ్లి ఏర్పాటు చేసుకోవాలని సూచించానని వైసిపి అధినేత వైఎస్ జగన్ తెలిపారు. ఈ మేరకు ఈ నెల 9న షర్మిలకు రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తుండటంతో ఈ లేఖను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంజలి పెళ్లి విషయం సంతోషం కలిగించిందని, జీవితాంతం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. అభ్యంతరాలను పట్టించుకోకుండా బెంగళూరులోని తన నివాసంలోనే పెళ్లి నిర్వహించాలని అనుకుంటున్నట్లు దృష్టికి వచ్చిందని, దానివల్ల తీవ్ర భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే వివిధ వ్యక్తుల ద్వారా తెలియజేశానని, క్యాటరింగ్, డెకరేషన్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సిబ్బంది, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, అతిథులు ఇలా ఎంతోమంది ప్రాంగణంలోకి వస్తారని, వీరిలో చాలామంది మనకు కనీసం పరిచయం కూడా లేని వ్యక్తులే ఉంటారని పేర్కొన్నారు. దీనివల్ల తీవ్ర భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. భద్రతకు, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ముప్పులను ఏమాత్రం విస్మరించలేనని పేర్కొన్నారు. హర్ష లేదా వర్ష పెళ్లి అయినా ఇదే నిర్ణయం తీసుకునేవాడినని వివరించారు. భద్రతకు, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఆందోళనలను ఇప్పటికే తెలియజేసినా, అభ్యంతరాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం బాధించిందని పేర్కొన్నారు. పెళ్లి కోసం మరో వేదికను ఎంచుకోవాలని కోరుతున్నానని తెలిపారు. కుమారుడి పెళ్లి చేసినట్లుగా కన్వెన్షన్ సెంటర్‌లో గానీ, డెస్టినేషన్ వెడ్డింగ్ వేదికలో గానీ పెళ్లి నిర్వహించుకోవచ్చని, అలాంటి వేదికలు ఇష్టం లేకపోతే హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ ఆస్తిని పెళ్లికి ఉపయోగించుకోవడానికి కూడా అవకాశం ఇచ్చానని తెలిపారు.







కామెంట్‌లు (0)