ప్రొద్దుటూరు: రాష్ట్ర ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన తాగునీటిని అందించే లక్ష్యంతో చేపడుతున్న జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార ప్రాజెక్టులకు సంబంధించిన ప్రత్యేక పైలాన్‌ను ప్రొద్దుటూరు పట్టణంలోని అమృత్ నగర్ కూడలిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో భాగంగానే రూ.30 వేల కోట్లకు పైగా వ్యయంతో రాష్ట్రంలో భారీ తాగునీటి అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సురక్షితమైన, నాణ్యమైన తాగునీరు అందించేందుకు జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార పథకం ద్వారా పనులు చేపడుతున్నామని డిప్యూటీ సీఎం వెల్లడించారు.
రూ.30,156 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న తాగునీటి సరఫరా, సమగ్ర రక్షిత తాగునీటి పథకాలు, మల్టీ విలేజ్ స్కీమ్స్, గ్రామీణ నీటి మౌలిక వసతుల ప్రాజెక్టుల వివరాలను ఈ పైలాన్‌లో పొందుపరిచారు. ప్రజలకు ప్రాజెక్టుల వివరాలు సులభంగా అర్థమయ్యేలా ఫలకాలపై వాటిని ప్రదర్శించారు. గండికోట జలాశయం నుంచి అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9,000 గ్రామాల్లో చేపడుతున్న సింగిల్ విలేజ్ స్కీమ్స్, 28 జిల్లాల్లో అమలవుతున్న వివిధ తాగునీటి ప్రాజెక్టుల వివరాలు ఇందులో ఉన్నాయి. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార పనులను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)