- రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 2025 సంవత్సరానికి ఉత్తమ జర్నలిస్టు అవార్డులకు దరఖాస్తుల గడువును అక్టోబర్ 5 వరకు పొడిగించినట్లు సమాచార పౌరసంబంధాల శాఖ సంచాలకులు కెఎస్ విశ్వనాథన్ తెలిపారు. అర్హులైన జర్నలిస్టులు అక్టోబర్ 5 సాయంత్రం 5 గంటల్లోగా విజయవాడలోని సమాచార పౌరసంబంధాల శాఖ కార్యాలయానికి దరఖాస్తులు పంపాలని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.12 విభాగాల్లో అవార్డులు అందించనుండగా, నగదు పురస్కారాలు రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఉన్నాయని తెలిపారు. కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు ఉత్తమ జర్నలిస్టు అవార్డుకు రూ.2 లక్షలు, గ్రామీణ జర్నలిస్టు అవార్డులు మూడు, సావిత్రిబాయి పూలే ఉత్తమ మహిళా జర్నలిస్టు, ఉత్తమ కార్టూనిస్టు, అబుల్ కలాం ఆజాద్ ఉత్తమ ఉర్దూ జర్నలిస్టు, ఉత్తమ ఎలక్ట్రానిక్ మీడియా, ఉత్తమ వీడియో జర్నలిస్టు అవార్డులకు రూ.లక్ష చొప్పున అందజేస్తారని పేర్కొన్నారు. విఆర్ నార్ల జీవిత సాఫల్య, కొక్కు అహోబలరావు ఉత్తమ ఫొటో జర్నలిస్టు, మద్దూరి అన్నపూర్ణయ్య అవార్డులను దరఖాస్తులు లేకుండానే ఎంపిక కమిటీ తన విచక్షణాధికారంతో ఎంపిక చేస్తుందని తెలిపారు. దరఖాస్తుతోపాటు జనవరి 1నుంచి డిసెంబర్ 2025లో ప్రచురితమైన, ప్రసారమైన కనీసం ఐదు వార్తా కథనాలు, వ్యాసాలు, ఫొటోలు, కార్టూన్లు, వీడియో క్లిప్పింగ్స్ జతచేయాలని పేర్కొన్నారు. ఉత్తమ జర్నలిస్టు పురస్కారాలకు సంబంధించిన అర్హతలు, దరఖాస్తు విధానం, ఇతర నిబంధనలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలోని మీడియా రిలేషన్స్ వెబ్‌సైట్‌లో https://mediarelations.ap.gov.in/media లో పరిశీలించవచ్చునని తెలిపారు.








కామెంట్‌లు (0)