- భీమవరంలో ఆరు కౌన్సిలర్ స్థానాలకే బిజెపి పరిమితం
- అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పి ఓటమి భయంతో వెనక్కి తగ్గిన వైనం
ప్రజాశక్తి-భీమవరం : పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఇలాకా భీమవరం మున్సిపాల్టీలో ఎన్నికలకు ముందే కమలానికి పరాభవం ఎదురైంది. కేవలం ఆరు కౌన్సిలర్ స్థానాల్లో పోటీకే పరిమితమైంది. వీటిలో రెండు స్థానాలు ఏకగ్రీవమవ్వగా మరో నాలుగు స్థానాల్లో పోటీలో ఉంది. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న భీమవరం ప్రాంతంలో బిజెపికి గడ్డు పరిస్థితి ఏర్పడింది. భీమవరం మున్సిపాల్టీలో మొత్తం 52 వార్డులకుగాను టిడిపి 24, జనసేన 23 స్థానాలు తీసుకుని బిజెపికి ఐదు స్థానాలు కేటాయించడంతో మంత్రి కేంద్ర మంత్రి అప్పట్లో బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని స్థానాల్లోనూ పోటీ చేసే సత్తా తమకు ఉందని చెప్పుకొచ్చారు. మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో నామినేషన్ల చివరి రోజు 26 స్థానాలకు 32 నామినేషన్లు బిజెపి తరఫున దాఖలయ్యాయి. ఈ పరిణామం కూటమి శ్రేణుల్లో కలకలం రేపింది. నామినేషన్ల పరిశీలనలో రెండు నామినేషన్లు వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ సమయానికి బిజెపి కేవలం ఆరు స్థానాలు ఉంచుకొని మిగిలిన 20 స్థానాల్లో ఉపసంహరించుకుంది. మొత్తం 52 వార్డులకుగాను టిడిపి 23, జనసేన 23 పోటీలో ఉండగా, బిజెపి ఆరు స్థానాలకే పరిమితమైంది. టిడిపిని, జనసేనను కాదని పోటీ చేస్తే ఓడిపోతాయనే భయంతోనే గత్యంతరం లేకే బిజెపి వెనక్కి తగ్గిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇది ఆ పార్టీకి పరాభవమేనని వ్యాఖ్యానిస్తున్నారు.
బిజెపి రాజ్యసభ సభ్యుని కుమారుడు ఇండిపెండెంట్‌గా బరిలో ఉండటంపై సర్వత్రా చర్చ
సుమారు 40 ఏళ్ల నుంచి బిజెపిలో సీనియర్ నేతగా ఉన్న రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ కుమారుడు ధనుంజయ్ నరసింహమూర్తి 39వ వార్డులో ఇండిపెండెంట్‌గా పోటీలో ఉన్నారు. కూటమి పొత్తులో భాగంగా ఈ వార్డును టిడిపికి కేటాయించారు. రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఇరువురిది ఇదే వార్డు. అయితే తన కుమారుడు ధనుంజయ్ నరసింహమూర్తి పోటీలో ఉంటారని రాజ్యసభ సభ్యుడు పాకా చెప్పకపోవడంతోనే సీతారామలక్ష్మి టిడిపి నుంచి బొక్కా శ్రీనివాస్‌ను బరిలో నిలుపారని ప్రచారం సాగుతోంది.








కామెంట్‌లు (0)