ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : బెంగళూరు– కడప– విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో నిర్మిస్తున్న సొరంగం పనులు కీలక మైలురాయిని అధిగమించాయి. జాతీయ రహదారి 544 జిలో చేపట్టిన ఈ సొరంగం పొడవు 3.68 కిలో మీటర్ల పొడవైన సొరంగం కావడం గమనార్హం. వైఎస్సార్ కడప జిల్లాలోని పోరుమామిళ్ల నుంచి నెల్లూరు జిల్లాలోని సీతారామపురం మధ్య ప్యాకేజ్–9లో భాగంగా ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. రూ.1,092.18 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు 2027 మధ్య నాటికిపూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కొండలు, అటవీ ప్రాంతం గుండా సాగుతున్న ఈ సొరంగ మార్గం ద్వారా రహదారి అనుసంధానం మెరుగుపడటంతో పాటు, రవాణా సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడనున్నాయి. బెంగళూరు – కడప– విజయవాడ ఎకనమిక్ కారిడార్ ద్వారా బెంగళూరు–విజయవాడ మధ్య ప్రయాణ దూరం 110 కిలోమీటర్లు తగ్గడంతో పాటు, ప్రయాణ సమయం 3–4 గంటలు ఆదా కానుంది. అలాగే ఎన్ హెచ్ -44,ఎన్ హెచ్ 16లను అనుసంధానించడం, హిందూపురం, కొప్పర్తి పారిశ్రామిక నోడ్లకు మెరుగైన సౌకర్యం కల్పించేందుకు కూడా ఈ మార్గం ఉపయుక్తంగా ఉంటుందని ఎన్‌హెచ్‌ఏఐ విజయవాడ రీజినల్ ఆఫీసర్ జి. హరికృష్ణ తెలిపారు. నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ సొరంగం దక్షిణ భారతదేశంలోని కీలక సొరంగమార్గాల్లో ఒకటిగా నిలవడంతో పాటు, ఈ ప్రాంత రహదారి మౌలిక వసతులకు మరింత బలోపేతాన్ని చేకూర్చనుందని తెలిపారు. సొరంగం తవ్వకం పనుల్లో కీలకమైన ఘట్టాన్ని అన్ని భద్రతా ప్రమాణాలను పాటిస్తూ వేగంగా పూర్తి చేసినందుకు ప్రాజెక్ట్ డైరెక్టర్ అనిల్‌కుమార్ రెడ్డి, కాంట్రాక్టర్ మ్యాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ మరియు ప్రాజెక్టు సిబ్బందిని అభినందించారు. మిగిలిన సొరంగం పనులతో పాటు ప్రాజెక్టుపనులన్నీ నిర్దేశిత గడువులోగా పూర్తవుతాయన్న విశ్వాసం వ్యక్త చేశారు.
బెంగళూరు–విజయవాడ ఎకనమిక్ కారిడార్లో కీలక సొరంగం పనులు పూర్తి
04 సెప్టెంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 12:35 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)