- మాజీ మంత్రి అంబటి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో: ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం లాఠీఛార్జి, రిగ్గింగులకు పాల్పడుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. శనివారం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు జరిగిన తీరుపై చంద్రబాబు నాయుడు అన్యాయంగా, అక్రమంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. నామినేషన్ వేయడానికి వెళ్తుంటే కొట్టారని, నామినేషన్లు చించేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో ప్రజాస్వామ్యం నడిబజారులో ఖూనీ అవుతోందని, టిడిపి నేతల చేతుల్లో తన్నులు తిన్న నీలాంబరం చావుబతుకుల మధ్య ఉన్నాడని, నామినేషన్ విత్ డ్రాలు చేసుకునేలా కొడుతున్నారంటే ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రశ్నించారు. అలాగే ఏడున్నర కోట్ల స్కామ్ జరిగితే జనసేన నేతలు మాట్లాడటం లేదని, ధరణి కృష్ణను మూడు రోజుల పాటు తిప్పి హింసించారని అన్నారు. ధరణికృష్ణ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే పోలీసులు బయట ఎక్కడో వదిలేశారని తెలిపారు. చంద్రబాబు చెబుతున్న స్ట్రైక్ రేట్ వెనుక ప్రజాదరణ లేదని, దౌర్జన్యాలు, అక్రమాలే ఉన్నాయని అంబటి రాంబాబు చెప్పారు.‘‘ప్రత్యర్థి పార్టీని పోటీలో లేకుండా చేసి గెలిచి.. నంబర్ వన్ అని చెప్పుకోవడం హాస్యాస్పదమని అన్నారు. నామినేషన్ల దశ నుంచి ఓట్ల లెక్కింపు వరకు అడుగడుగునా అక్రమాలేనని విమర్శించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సొంతూరైన బుర్రిపాలెంలో దళితుడిపై దాడి చేసి నామినేషన్ ఉపసంహరించుకోవాలని బెదిరించారు. నామినేషన్ ఉపసంహరించుకోలేదని నీలాంబరం గొంతుకు తాడు బిగించి చంపేందుకు ప్రయత్నించారు. దళితుడిపై దాడి జరిగినా పోలీసులు వెంటనే కేసు తీసుకోలేదని అన్నారు.








కామెంట్‌లు (0)