- మాజీ మంత్రి పేర్ని నాని
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : లిక్కర్ కేసులో సరైన సాక్ష్యాలు లేక సాగదీస్తున్నారని మాజీ మంత్రి పేర్ని వెంక్రటామయ్య (నాని) విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతి లడ్డూ వ్యవహారంలో సిబిఐ విచారణతో నిజాలు బయటకొచ్చాయని అన్నారు. ఇంతకాలం సిఎం చంద్రబాబు చేసిన ఆరోపణలకు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, వాటిని అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొత్తకొత్త అంశాలను తెరపైకి తెస్తోందని విమర్శించారు. రాష్ట్ర రైతాంగం కరువు కోరల్లో చిక్కుకున్నా, వారిని ఆదుకునే ముందస్తు కార్యాచరణ లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. లిక్కర్ కేసు పేరుతో రెండేళ్లుగా సిట్ దర్యాప్తు సాగుతోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో రూ.లక్ష కోట్ల అవినీతి అన్నారని, తర్వాత రూ.44 వేల కోట్లు, అనంతరం రూ.33 వేల కోట్లు, చివరకు రూ.3 వేల కోట్లకు వచ్చారని విమర్శించారు. ఇంతకాలం దర్యాప్తు చేసి సాధించింది ఏమిటో ప్రజలకు ప్రభుత్వం చెప్పాలన్నారు. సత్యప్రసాద్‌ను ఒకప్పుడు నిందితుడిగా చూపించిన వాళ్లే, ఇప్పుడు ఆయనను అప్రూవర్‌గా మార్చి కొత్త కథలు అల్లుతున్నారని అన్నారు. డిఎస్‌సి నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ప్రభుత్వం సమగ్రంగా విచారణ చేయాలన్నారు.








కామెంట్‌లు (0)