బుధవారం, 19 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

స్థానిక సంస్థల ఎన్నికలను అక్టోబరులో నిర్వహించాల్సిందే : సిఎం చంద్రబాబు

1 గంట క్రితం

Continue the search until the fishermen are traced: CM Chandrababu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 11:27 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

అమరావతి : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను అక్టోబరులో నిర్వహించాల్సిందేనని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల అంశంపై మంగళవారం మంత్రివర్గ సమావేశంలో విస్తృతంగా చర్చించామన్నారు. గడువులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే.. 16 వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్రం కోల్పోతుందని తెలిపారు. 16వ ఆర్థిక సంఘం నిధులు ఐదేళ్లలో రాష్ట్రంలోని పంచాయతీరాజ్‌ సంస్థలకు సుమారు రూ.16,600 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.12,150 కోట్లు రావాలంటే కచ్చితంగా ఎన్నికలు జరిగి తీరాలని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి నగరపాలక, పురపాలక ఎన్నికలను నిర్వహించాలన్నారు. 2021లో సమీప గ్రామాల విలీన అంశంపై కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు జరగని 23 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకూ ఈసారి ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు. కేసులు వేసిన వారితో మాట్లాడి వాటిని ఉపసంహరించుకునేలా చేయాలని, లేనిపక్షంలో ప్రస్తుతానికి సమీప గ్రామాల విలీన ప్రక్రియను పక్కనపెట్టి ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. వైసిపి ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలుపరచకుండా, వారికి ద్రోహం చేసిందని మంత్రిమండలి ధ్వజమెత్తిందన్నారు. 2024 ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని నిర్ణయించిందని తెలిపారు.


నిత్యావసరాల ధరలపై దృష్టి సారించండి ....

ద్రవ్యోల్బణం పెరగటంతో నిత్యావసరాల ధరలు అదుపు తప్పుతున్నాయని, వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని మంత్రులు, అధికారులను సిఎం ఆదేశించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రతిపక్ష పార్టీ దురుద్దేశపూర్వకంగా చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు. అర్థంపర్థంలేని పేర్లు, బ్రాండ్‌లతో మద్యం మార్కెట్‌లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థులకు ఐటీలో నైపుణ్యాన్ని తప్పనిసరి చేయాలని తెలిపారు. ప్రతి పనికీ ఒక ఉద్యోగి ఉండాలనే విధానాన్ని పక్కనపెట్టాలని సూచించారు. పీఎం సేతు కార్యక్రమాన్ని ఇంటర్మీడియట్‌తో అనుసంధానించాలని చెప్పారు. విద్యుత్తుశాఖ బాగా పనిచేస్తోందని, విద్యుత్తు కొనుగోళ్లలో యూనిట్‌కు 23 పైసలు ఆదా చేసిందని ప్రశంసించారు. పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ కొత్త అవకాశాలను అన్వేషిస్తూ, ప్రాజెక్టులను ముందుకు తీసుకెళుతున్నారని అభినందించారు. ‘మిగతావారూ స్ఫూర్తి పొందాలి. కొత్త అవకాశాలను సృష్టించుకోవాలి. జాప్యానికి తావివ్వకుండా రియల్‌టైమ్‌లో పనిచేయాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తన ప్రసంగం.. ప్రధాని ప్రసంగంతో 93 శాతం మ్యాచ్‌ అయిందని, మంత్రులు కూడా ఆ స్థాయికి రావాలని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం 200 గురుకులాలు అభివృద్ధి చేయాలని చెప్పారు. విశాఖలో రిలయన్స్‌ డేటా సెంటర్‌కు భారీగా నీరు అవసరమవుతుందని వైసిపి చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సిఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్