బుధవారం, 19 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

2027 జనాభా లెక్కల్లో కుల గణనపై కేంద్రం వైఖరిని ప్రశ్నించిన జైరాం రమేష్‌

1 గంట క్రితం

Jairam Ramesh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 12:27 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : 2027 జనాభా లెక్కల్లో కులానికి సంబంధించిన వివరాలను సేకరించే విధానం ‘‘ఉద్దేశపూర్వకంగానే లోపభూయిష్టంగా’’ ఉందని కాంగ్రెస్‌ కమ్యూనికేషన్‌ విభాగం ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ విమర్శించారు. ఈ విధానం వెనుక ‘‘లోతైన దురుద్దేశం’’ ఉందని బుధవారం ఆరోపించారు. గతంలో ఎన్నడూ అడగని విధంగా మతం, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల జన్మస్థలం వంటి వివరాలను సేకరించనున్నారని ఆయన పేర్కొన్నారు. 2027 జనాభా లెక్కల్లో తల్లిదండ్రుల మతం, పుట్టిన తేదీ, జన్మస్థలానికి సంబంధించిన వివరాలను గ్రామ స్థాయి వరకు సేకరించనున్నట్లు పేర్కొన్న మీడియా కథనాన్ని జైరాం రమేష్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. జనాభా లెక్కల ప్రశ్నావళిలో కులాన్ని ప్రకటించేందుకు ఓపెన్‌ ఫీల్డ్‌ ఆప్షన్‌తో పాటు, ‘‘కులాన్ని ప్రకటించదలచుకోలేదు’’, ‘‘కులం లేదు’’ అనే ఎంపికలు కూడా ఉన్నట్లు ఆ కథనం పేర్కొంది. కుల గణనను అడ్డుకునేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ మంగళవారం విమర్శించింది. 2027 జనాభా లెక్కల్లో కులాల ఎంపిక కోసం ‘డ్రాప్‌డౌన్‌ మెనూ’ను ఎందుకు చేర్చలేదని ఆ పార్టీ ప్రశ్నించింది. 2021 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం స్వయంగా ఈ విధానాన్ని సిఫార్సు చేసిందని జైరాం రమేష్‌ గుర్తుచేశారు. 2025 ఏప్రిల్‌ 30న కుల గణన నిర్వహించనున్నట్లు ప్రకటించడం ద్వారా ప్రధాని మోడీ ‘‘పూర్తిగా యూ-టర్న్‌’’ తీసుకున్నారని, ఇప్పుడు అదే నిర్ణయంపై మరోసారి యూ-టర్న్‌ తీసుకుంటున్నారని కాంగ్రెస్‌ విమర్శించింది. 2021 సెప్టెంబర్‌ 21న సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కుల గణన నిర్వహించాలన్న డిమాండ్‌ను మోడీ ప్రభుత్వం తిరస్కరించిందని జైరాం రమేష్‌ పేర్కొన్నారు. అయితే, అదే అఫిడవిట్‌లోని 12(డి) పేరాలో కులాల నమోదుకు ముందుగా రిజిస్ట్రీని సిద్ధం చేయలేదని, కులాల ఎంపికకు ‘డ్రాప్‌డౌన్‌ మెనూ’ ఉంటే విశ్వసనీయమైన, స్థిరమైన సమాచారం లభించే అవకాశం ఉండేదని కేంద్రం పేర్కొందని తెలిపారు. ‘‘2021లో సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో మోడీ ప్రభుత్వం స్వయంగా సిఫార్సు చేసిన ‘డ్రాప్‌డౌన్‌ మెనూ’ విధానాన్ని 2027 జనాభా లెక్కల ప్రక్రియలో ఎందుకు చేర్చలేదు?’’ అని జైరాం రమేష్‌ ప్రశ్నించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్